అసోంలో వంద సీట్లు గెలవడమే లక్ష్యమని భాజపా అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎగతాళి చేశారు కాంగ్రెస్ నేత, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్. అమిత్ షా తమకు(కాంగ్రెస్‌కు) వచ్చే సీట్ల గురించే మాట్లాడుతున్నారని, ఛత్తీస్‌గఢ్‌లో 'మిషన్ 65 ప్లస్'(65 స్థానాలకు మించి భాజపా గెలుపొందాలని లక్ష్యం) విపక్షాలకే వాస్తవంగా మారిందని అన్నారు.
పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బఘేల్.. నాలుగింట మూడొంతుల మెజారిటీతో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అసోంలో 100కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
"అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి 65 సీట్లు గెలుస్తామని చెప్పారు. ఆయన చెప్పిన 65 సీట్లు మనకే(కాంగ్రెస్‌కు) వస్తాయని అప్పుడు నేను అన్నాను. ఫలితాలు వచ్చాయి. మేం 68 స్థానాలు గెలిచాం. ఇప్పుడవి 70 అయ్యాయి. అసోంలో వంద సీట్లు వస్తాయని మా తరపునే అమిత్ షా చెబుతున్నారు. అసోం ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా లేరు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రజలకు చూపించిన కలల్ని నిజం చేయలేదు. మోసపోయామని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు వారు పరివర్తన్(మార్పు) కోరుకుంటున్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో అసోంలో మహా కూటమి అధికారంలోకి రాబోతుంది."
-భూపేశ్ బఘేల్, ఛత్తీస్‌గఢ్ సీఎం
పౌరసత్వ సవరణ చట్టం సహా అసోం ఒప్పందం క్లాజ్-6పై ప్రజలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు బఘేల్. అసోం ప్రజల ప్రయోజనాల ప్రకారం సీఏఏ నిబంధనలు రూపొందిస్తామన్న హిమంత వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశవ్యాప్త అమలు కోసం తయారుచేసే సీఏఏను ఒక్క రాష్ట్రం కోసం ఎలా మార్చుతారని ప్రశ్నించారు.