Amit Shah Speech Today No Confidence Motion : ప్రభుత్వాలను కాపాడుకోవడానికి విపక్ష కూటమి పార్టీలు అవినీతికి పాల్పడ్డాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. దీన్ని బట్టే ఆ పార్టీల నిజస్వరూపం అందరికీ అర్థమైందని అన్నారు. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడిన ఆయన.. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవినీతికి పాల్పడలేదని, బదులుగా రాజీనామా చేసేందుకే మొగ్గు చూపారని తెలిపారు. కాంగ్రెస్ మాత్రం.. ఎంపీలకు లంచాలు ఇచ్చి ప్రభుత్వాలను నిలబెట్టుకుందని విమర్శించారు.
"1993లో ప్రధానమంత్రి పీవీ నరసింహరావు అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో కొనసాగాలని కాంగ్రెస్ భావించింది. పీవీ అవిశ్వాస తీర్మానాన్ని గెలిచారు. కానీ, ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత పీవీ సైతం జైలుకు వెళ్లారు. ఈ రోజు జేఎంఎం, కాంగ్రెస్ విపక్షంలో కూర్చున్నాయి. 2008లో మన్మోహన్ సింగ్ విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో అత్యంత అవమానకరమైన ఘటనలు ఈ సభలో జరిగాయి. ఎంపీలకు కోట్ల రూపాయల లంచాలు ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నారు. యూపీఏ స్వభావం ఇది."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
Amit Shah on Manipur Violence :
మణిపుర్‌లో హింసాకాండపైనా అమిత్ షా మాట్లాడారు. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు జరిగాయన్న విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అలాంటి ఘటనలకు ఎవరూ మద్దతివ్వరని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిపై రాజకీయాలు చేయడమే అవమానకరమని విపక్షాలనుద్దేశించి విమర్శలు గుప్పించారు. సమావేశాల మొదటి రోజు నుంచి మణిపుర్ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు అమిత్ షా చెప్పారు. విపక్షాలే చర్చను జరగనీయలేదని ఆరోపించారు. హింసలో పాల్గొన్న మైతేయీ, కుకీ తెగలతో తాను వేర్వేరుగా చర్చలు జరుపుతున్నానని అమిత్ షా వివరించారు. ఇరువర్గాలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. చర్చలే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు.
"నేను మణిపుర్ అంశంపై మాట్లాడకూడదని విపక్షాలు కోరుకున్నాయి. కానీ వారు నన్ను నిశబ్దంగా ఉంచలేరు. 130 కోట్ల మంది ప్రజలు మమ్మల్ని గెలిపించారు. కాబట్టి వారు తప్పక వినాల్సిందే. గడిచిన ఆరేళ్లలో మణిపుర్‌లో కర్ఫ్యూ విధించే అవసరమే రాలేదు. భారత్, మయన్మార్ మధ్య సరిహద్దుల్లో ఎలాంటి కంచె లేకపోవడం వల్ల మయన్మార్ నుంచి శరణార్థులు స్వేచ్ఛగా వస్తున్నారు. సైనికుల పహారాతో మణిపుర్‌లో పరిస్థితులు చక్కబడ్డాయి. వేలాదిగా వలసలు రావడం వల్ల స్థానికుల్లో అభద్రతా భావం నెలకొంది. 1993లో 700 మంది ప్రజలు నాగా-కుకీ ఘర్షణల్లో చనిపోయారు. అప్పుడు ప్రధాని, హోంమంత్రి కాకుండా.. హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీ హయాంలోనే మతపరమైన అల్లర్లు ఎక్కువ జరిగాయి.
నలుగురు మైతేయీల దుష్ప్రవర్తనతో మణిపుర్ (వైరల్ వీడియో) ఘటన జరిగింది. ఏ నాగరిక మహిళలకూ అలా జరిగి ఉండకూడదు. వీడియోలోని వ్యక్తులను ఫేస్ రికగ్నైజేషన్‌తో గుర్తించి అరెస్టు చేశాం. మణిపుర్ అల్లర్లలో 152 మంది చనిపోయారు. హింసాత్మక ఘటనల్లో 14,898 మంది అరెస్టయ్యారు. 1106 కేసులు నమోదయ్యాయి. మణిపుర్ ఘటనలో సీఎస్, డీజీపీని బదిలీ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు మణిపుర్ సీఎం సహకరిస్తున్నారు. ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించకపోతేనే మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. మణిపుర్‌లో పరిస్థితులు క్రమంగా అదుపులోకి వస్తున్నాయి. పరిస్థితులు చక్కబడుతున్నప్పుడు మీరు పెట్రోల్ చల్లొద్దు. మణిపుర్ పర్యటనలో రాహుల్ గాంధీ నాటకాలు ఆడారు. రాహుల్ పర్యటన కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేస్తే.. రోడ్డుమార్గంలోనే వెళ్తానని పట్టుబట్టారు. సాధ్యమైనంత త్వరలో మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరిస్తాం."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి