తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్‌ గాంధీ యాత్ర చేసేది ఆ పనికోసమే'.. షా, ఇరానీ విమర్శలు - kanyakumari bharat jodo yatra

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర నేపథ్యంలో.. భాజపా కేంద్రమంత్రులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. విదేశీ బ్రాండ్​ టీషర్ట్​ ధరించి యాత్ర చేస్తున్నారని రాహుల్​ను ఎద్దేవా చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. ఇప్పుడు యాత్ర చేయాల్సిన అవసరం ఏముందని రాహుల్​ను ప్రశ్నించారు మరో మంత్రి స్మృతి ఇరానీ.

Etv Bharat
Etv Bharat

By

Published : Sep 10, 2022, 10:36 PM IST

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రపై భాజపా నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. ఈ కార్యక్రమంపై భాజపా, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఆయన తొలుత దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. విదేశీ బ్రాండ్‌ టీషర్ట్‌ ధరించి.. 'భారత్ జోడో యాత్ర'కు వెళ్లారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో శనివారం నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో అమిత్‌ షా ఈ మేరకు మాట్లాడారు.

'గతంలో పార్లమెంట్‌లో రాహుల్‌ గాంధీ ఇచ్చిన ప్రసంగాన్ని గుర్తుచేయాలనుకుంటున్నా. ఆయన.. భారత్‌ను అసలు ఒక దేశమే కాదన్నారు. ఈ విషయాన్ని ఆయన ఏ పుస్తకంలో చదివారు? ఇదొక దేశం.. దీని కోసం లక్షలాది మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు' అని అమిత్‌ షా అన్నారు. 'రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేసేందుకు వెళ్లారు. కానీ, అంతకుముందు ఆయన దేశ చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది' అని విమర్శించారు. అభివృద్ధి కోసం కాదని.. బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ పనిచేస్తోందని ఆరోపణలు చేశారు.

ఈ ప్రశ్నకు రాహుల్​ సమాధానం చెప్పాలి: స్మృతి ఇరానీ
మరోవైపు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం రాహుల్‌పై మండిపడ్డారు. దేశ ఐక్యతను ఎవరు దెబ్బతీశారని.. ఇప్పుడు ఇటువంటి యాత్ర చేపట్టాల్సిన అవసరం వచ్చిందని ప్రశ్నించారు. 'దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవరు సాహసించారో ఆయన ముందు సమాధానం చెప్పాలి. దేశం ముక్కలు ముక్కలవుతుంది అని నినాదాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో సభ్యుడిగా చేర్చుకున్నారు' అని గుర్తుచేశారు. కర్ణాటకలోని దొడ్డబల్లాపురలో నిర్వహించిన కార్యక్రమంలో స్మృతి ఇరానీ ఈ మేరకు ప్రసంగించారు. రాహుల్‌ గాంధీ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారని ఆరోపిస్తూ.. ఆయన అధికార దాహాన్ని చూసి షాక్‌ అయినట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details