Amit Shah Security Breach : ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శినంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కనే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని గిర్గావ్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి పంపింది. సెప్టంబర్ 5న జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది:అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ముంబయిలో పర్యటించారు. నగరంలోని ప్రముఖ గణేశ్ మండపాల్ని సందర్శించారు. ఆ తర్వాత పురపాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భాజపా కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భద్రతా లోపం తలెత్తినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.
ఓ వ్యక్తి అమిత్ షాకు అతి దగ్గరగా, చాలా సేపు తిరుగుతూ ఉన్నట్లు అధికారులు గమనించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. నిండితుడు మహారాష్ట్రలోని ధూలెకు చెందిన హేమంత్ పవార్‌గా గుర్తించారు. మలబార్ హిల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.