కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35 స్థానాల్లో గెలిపించాలని బంగాల్ రాష్ట్ర ప్రజలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 35 చోట్ల తమను గెలిపిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం.. రాష్ట్రంలో 'హిట్లర్ తరహా పాలన'ను కొనసాగిస్తోందని షా దుయ్యబట్టారు. బంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన ర్యాలీలో షా ఈ వ్యాఖ్యలు చేశారు. బంగాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా.. శుక్రవారం బీర్భూమ్ చేరుకున్నారు.
ఇటీవలే జరిగిన శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసను ప్రస్తావించిన షా.. తాము అధికారంలో ఉంటే ఇటువంటి ఘటనలు జరిగేవా అని ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో శ్రీరామ నవమి శోభాయాత్రలను జరుపుకోకూడదా? శోభాయాత్రలపై దాడులు చేస్తారా? అని ప్రశ్నలు వేశారు. ఈ దారుణానికి కారణం ముఖ్యమంత్రి మమత బెనర్జీ అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలేనని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే, శ్రీరామ నవమి శోభాయాత్రలపై దాడి చేసే ధైర్యం ఎవరికీ ఉండదన్నారు. మమత బెనర్జీ, ఆమె మేనల్లుడు పాల్పడుతున్న చర్యలకు వ్యతిరేకంగా పోరాడగలిగేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. మరోసారి నరేంద్ర మోదీయే దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.