Amit Shah On Abrogation Of Article 370 :జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 370'ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వాగతించారు. ఇప్పటికీ ఆర్టికల్ 370 శాశ్వతమైనదని ఎవరైనా అంటే వారు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను అవమానించినట్లేనన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు తర్వాత జమ్ముకశ్మీర్ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదని చెప్పారు. సరైన సమయంలో జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా తెలిపారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రహోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చర్చ అనంతరం రాజ్యసభ మూజవాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.
"జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 వేర్పాటువాదానికి దారితీసింది. అది తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. ఆర్టికల్ 370 రద్దుపై తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిది. కశ్మీరీలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో భాగం. దానిని ఎవరూ ఆక్రమించలేరు. కాదని ఎవరైనా ప్రయత్నిస్తే గట్టిగా బుద్ధి చెబుతాం. భారతదేశ అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదు. అందుకు బీజేపీ ఎప్పటికీ సిద్ధంగా ఉండదు. ఆర్టికల్ 370 ముసుగులో మూడు కుటుంబాలు అధికారాన్ని అనుభవించాయి. గత 75 ఏళ్లుగా స్థానిక ఎస్టీ ప్రజలు అన్ని హక్కుల్నీ కోల్పోయారు"
- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి