Amit shah in Ayodhya: ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయోధ్యలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. రామాలయ నిర్మాణం ఆలస్యం కావడానికి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ధ్వజమెత్తారు. కరసేవకులపై కాల్పులు జరిపింది ఎవరో? కొన్నేళ్ల పాటు రామ్‌లల్లా టెంటు కిందే ఉండటానికి కారకులెవరో? ప్రజలు గుర్తు చేసుకోవాలని సూచించారు.
"రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ప్రయత్నాలు చేశాయి. కర సేవకులపై కాల్పులు జరిపింది ఎవరో మీకు గుర్తుందా? వాళ్లను దారుణంగా హింసించారు. చంపి సరయూ నదిలో పడేశారు. రామ్ లల్లా కొన్ని సంవత్సరాల పాటు టెంటు కిందే ఎందుకు ఉండాల్సి వచ్చింది? అయోధ్యలో రామనవమి, దీపోత్సవాన్ని ఎవరు ఆపారు? ఇవన్నీ మనం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాలయ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి