దిల్లీ హింస నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి, దిల్లీ పోలీసు కమిషనర్, ఐబీ చీఫ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. రైతుల ట్రాక్టర్ ర్యాలీలో చెలరేగిన హింసపై షాకు అధికారులు సవివరంగా నివేదిక అందించారు.
ఘర్షణలు చెలరేగిన అనంతరం ఒకరోజు వ్యవధిలో ఉన్నతస్థాయి అధికారులతో షా భేటీకావడం ఇది రెండోసారి.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై దృష్టి సారించాలని అన్ని దర్యాప్తు సంస్థలను కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశించింది. దేశ రాజధానిలో అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. నిర్ణీత సమయం, నిర్దేశిత మార్గాలను వీడి నిరసనకారులు ఐటీఓ, ఎర్రకోటవైపు దూసుకెళ్లారు. ఎర్రకోటపై ఓ మతానికి చెందిన జెండాను ఎగురవేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పలు ప్రాంతాల్లో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు, జలఫిరంగులు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు- రైతుల మధ్య ఘర్షణ చెలరేగింది.
200మంది అరెస్ట్...
ట్రాక్టర్ ర్యాలీలో హింసకు సంబంధించి ఇప్పటివరకు 200మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వారందరినీ ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.