Bengal Panchayat Election 2023 : 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు అగ్నిపరీక్షలా మారిన బంగాల్ పంచాయతీ ఎన్నికలు శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. 22 జిల్లా పరిషత్‌లలోని 928 స్థానాలకు, 9,730 పంచాయతీ సమితులకు, 63,229 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగుతున్నాయి. 5.67 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 1970 చివర్లో బంగాల్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత కేంద్ర బలగాల పర్యవేక్షణలో పంచాయతీ ఎన్నికలు జరగడం ఇది రెండోసారి. 65వేల కేంద్ర రిజర్వ్‌డ్ పోలీసు సిబ్బందితో పాటు 70వేల మంది బంగాల్ పోలీసులను మోహరించారు. బంగాల్ జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. 42పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం వల్ల అధికార, విపక్షాలకు, పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. శనివారం ఒకే దశలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు జూలై 11న జరగనుంది.
హింసాత్మక ఘటనలు..
అయితే, పోలింగ్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. కాంగ్రెస్ కార్యకర్తపై టీఎంసీ కార్యకర్త కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రచారం చేసి ఇంటికి వెళ్తున్న తనను టీఎంసీ కార్యకర్తలు తుపాకీతో కాల్చారని బాధితులు చెప్పారు. ప్రజలను ఓటేయనీయకుండా అడ్డుకుంటోందని టీఎంసీపై కాంగ్రెస్ మండిపడింది.
'అన్నింటికీ పరిష్కారం ఓటే'
ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ సీవీ ఆనంద బోస్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజలందరూ నిరాశలో ఉన్నారని.. హింస చెలరేగడం వల్ల భయంతో జీవిస్తున్నారని చెప్పారు. వీటన్నింటికీ పరిష్కారం శనివారం జరిగే ఎన్నికలే అని తెలిపారు. హింస, అవినీతికి శాశ్వత పరిష్కారం ఓటు హక్కుతోనే పొందుతామన్నారు.