Omicron scare in India: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పండగ వేళ.. రద్దీని నియంత్రించేందుకు అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.
టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కొవిడ్ నిబంధనలు పాటించాలన్న వ్యూహంలో నిర్లక్షంగా ఉండకూడదని లేఖలో సూచించింది హోంశాఖ. కరోనా నివారణ, నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని నిర్దేశించింది.
"దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. డెల్టా కన్నా ఇది వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి."