పంజాబ్ తరహాలో ఛత్తీస్‌గఢ్‌లోనూ ముఖ్యమంత్రి మార్పునకు(chhattisgarh cm change news ) కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపనుందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవలే.. ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్(chhattisgarh cm bhupesh baghel) సన్నిహిత వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు దిల్లీకి మకాం మార్చటం వాటికి బలం చేకూర్చింది. తాజాగా మరింత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు చేరుకున్నారు. బఘేల్ వర్గం ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లటం.. ఆయనకు ఉన్న బలాన్ని నిరూపించుకునేందుకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యేలు(chhattisgarh congress news) తమ సొంత నిర్ణయంతో దిల్లీకి వెళ్లారని, ఇది బల ప్రదర్శన కానేకాదని బఘేల్ వర్గంలోని పలువురు స్పష్టం చేశారు.
ఇప్పటికే దిల్లీకి 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోగా.. శుక్రవారం రాత్రికి మరో 10 మంది వెళ్లినట్లు సమాచారం.
2021, జూన్‌లో ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు భూపేశ్ బఘేల్. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పు జరగాలని డిమాండ్లు(chhattisgarh congress crisis) వచ్చాయి. అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవిని తనకు అప్పగిస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం 2018లో హామీ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి టీఎస్ సింగ్ దేవ్ పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు అనేది ఉండబోదని స్పష్టం చేశారు బఘేల్ మద్దతుదారు, దిల్లీ చేరుకున్న ఎమ్మెల్యే బ్రిహస్పత్ సింగ్. బఘేల్ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందన్నారు. 'ఇక్కడకు ఏఐసీసీ ఛత్తీస్‌గఢ్ ఇంఛార్జి పీఎల్ పూనియాని కలిసేందుకు వచ్చాం. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనను పొడిగించాలని కోరాలనుకుంటున్నాం. దాని ద్వారా ఎమ్మెల్యేలందరికీ లబ్ధి చేకూరుతుంది.' అని పేర్కొన్నారు సింగ్.
అలా జరగదు..
ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లటంపై స్పందించారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్. ఛత్తీస్‌గఢ్.. పంజాబ్‌లా మారబోతుందని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్ ఎప్పటికీ పంజాబ్‌లా కాబోదని స్పష్టం చేశారు.