Amicus Curiae On Convicted Representatives :నైతికపరమైన అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో శిక్షపడిన చట్టసభ సభ్యులను జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తన నివేదికలో సూచించారు. వారిని తిరిగి చట్టసభలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను త్వరితగతిన నిర్వహించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హన్సారియా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంలో ఎప్పటికప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పిస్తున్నారు.
శుక్రవారం ఈ పిటిషన్ సుప్రీకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన 19వ నివేదికను సమర్పించారు. ఆత్యాచారం,ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతల విషయంలో కఠినంగా వ్యహరించాలని అందులో పేర్కొన్నారు. వారిని జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని సూచించారు. నైతిక అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో శిక్ష పడితే నాలుగో తరగతి ఉద్యోగిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆయన తెలిపారు.
విజయ్ హన్సారియా నివేదిక ప్రకారం..
Vijay Hansaria Report on Convicted Representatives : 2022 నవంబరు నాటికి దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,116 కేసులు అయిదేళ్లకుపైబడి విచారణలో ఉన్నాయి. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,377 ఉండగా.. 719 కేసులతో రెండో స్థానంలో బిహార్ ఉంది. 92 కేసులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా.. అందులో 50 కేసులో అయిదేళ్లపైబడి పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 కేసులుండగా.. అందులో అయిదేళ్లపైబడి పెండింగ్‌లో ఉన్నవి 4 కేసులు. ఈ కేసుల విచారణకు సంబంధించి దేశవ్యాప్తంగా జడ్జీలపై పని భారం తీవ్రంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఒక్కో జడ్జిపై సగటున 25 నుంచి 210 కేసుల భారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 92, తెలంగాణలో 1 నుంచి 16 కేసుల భారం ఉంది.