నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో జరిగింది. సగం కాలిపోయిన శరీరం గ్రామంలోని డ్రైనేజీ వద్ద లభ్యమైంది. క్షుద్రపూజలు చేసి తమ కుమారుడిని బలి ఇచ్చారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది
జామే పోలీస్ స్టేషన్ పరిధిలోని రేసి గ్రామంలో జితేంద్ర ప్రజాపతి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు దీపు ఆదివారం రాత్రి కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అతడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గ్రామంలోని ఓ డ్రైనేజీ వద్ద సగం కాలిపోయిన స్థితిలో దీపు మృతదేహం కనిపించింది. అతడి కళ్లు సైతం పీకేశారు. క్షుద్రపూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బీజేపీ మహిళా నేత హత్య
అసోంలోని గోపాలపురాలో బీజేపీ మహిళా నేత జోనాలి నాథ్ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి 17వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న శల్పారా గ్రామంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, జోనాలి కుటుంబసభ్యులు మాత్రం ఇది రాజకీయ హత్యని ఆరోపిస్తున్నారు. జోనాలి నాథ్‌ను చివరిసారిగా రిజ్వాల్ కరీమ్ అనే వ్యక్తితో చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.