వైజాగ్ అబ్బాయి అభిషేక్ శామ్యూల్‌కు అమెరికా అమ్మాయి హాన్నా మధ్య ప్రేమ చిగురించింది. పెద్దల అంగీకారంతో గతేడాది వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత హాన్నా జీవితం పూర్తిగా మారిపోయింది. తెలుగింటి ఆడపడచుగా హాన్నా తనను తాను తీర్చుదిద్దుకుంది. స్పూన్లు వదిలి, చేతులతో భోజనం చేస్తోంది. ముక్కుపుడక పెట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు అక్షరాలను చకచకా రాసేస్తోంది. ఎలాంటి తప్పులు లేకుండా తెలుగులో మాట్లాడేస్తోంది.
ప్రపంచానికి భారతీయ సాంస్కృతిని పరిచయం చేయాలని నిర్ణయించుకుని ఇంకో అడుగు ముందుకేసింది హాన్నా. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక వీడియోలు పెడుతోంది.
"హాయ్! నా పేరు హాన్నా. నేనో అమెరికన్. ఓ భారతీయుడితో నాకు పెళ్లి జరిగింది. జీవితం అత్యద్భుతంగా ఉంది. అమెరికా-భారత్ సంప్రదాయాల్లో ఉన్న వ్యత్యాసాలను ప్రపంచానికి తెలిజేయాలనుకుంటున్నా. విభిన్న ఆచారాల మధ్య బంధం అంటే ఎన్నో సవాళ్లుంటాయి. వాటిని కూడా చెప్పాలనుకుంటున్నాను. మాలాగే ఎవరైనా ఉంటే నన్ను ఫాలో అవ్వండి," అంటోంది తెలుగింటి అమెరికా ఆడపడచు.
'ప్రియా పచ్చడంటే చాలా ఇష్టం...'
భారతీయులు తినే ఆహారం నుంచి వేసుకునే దుస్తుల వరకు, తెలుగు ప్రజలు చూసే సీరియళ్ల నుంచి ఇళ్లల్లో ఉండే వస్తువుల వరకు.. అమెరికాకు- ఇండియాకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ఎంతో ఫన్నీగా చెప్పుకొస్తోంది హాన్నా.
హాన్నాకు ప్రియా పచ్చళ్లంటే చాలా ఇష్టమట. 'కొన్న రెండు రోజులకే పచ్చడి సీసా ఖాళీ అయిపోతోంది' అంటోంది.