భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన బ్రిటీష్ వారిని తరిమికొట్టే మహాక్రతువులో అనేకమంది తమ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిలో విదేశీయులూ అనేకమంది ఉన్నారు. యాపిల్ మ్యాన్ స్టోక్స్ అనే అమెరికా వాసి భారత జాతీయోద్యమంలో పాల్గొని తనవంతు సహకారాన్ని అందించారు. శామ్యూల్ స్టోక్స్ అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టారు. వారికి లిఫ్ట్‌ల తయారీ వ్యాపారం ఉండేది. బాగా సంపన్న కుటుంబం. స్టోక్స్ మాత్రం వ్యాపారం వైపు కాకుండా దాతృత్వంవైపు మళ్లారు. ఫలితంగా మిషనరీ యాత్రలో భాగంగా 22 ఏళ్ల వయసులో శిమ్లా సమీపంలో కుష్ఠురోగులకు సేవ చేయటానికి భారత్‌కు వచ్చారు.
కానీ.. కుష్ఠురోగులు, స్థానిక ప్రజలు ఆయనతో అంతగా మమేకం కాలేకపోయారు. కారణం తన అమెరికన్ వేషధారణ, భాష.. అని గుర్తించిన స్టోక్స్ క్రమంగా భారతీయ దుస్తుల్లోకి మారి స్థానిక భాష నేర్చుకోవటం ఆరంభించారు. తద్వారా వారికి దగ్గరయ్యారు. ఇక్కడే పుట్టి పెరిగిన ఆంగ్లో ఇండియన్ ఆగ్నెస్‌ను పెళ్లాడి, హిమాచల్‌లోనే భూమి కొనుక్కొని స్థిరపడ్డారు. 1916లో అమెరికా వెళ్లి వచ్చిన ఆయన అక్కడి లూసియానా రాష్ట్రంలోని యాపిల్ పండ్ల పంటకు హిమాచల్ వాతావరణం కూడా అనువైందని భావించి.. ఆ మొక్కలను దిగుమతి చేయించారు. తన ఇంటిలోనే ప్రయోగాత్మకంగా వేసి చూశారు. అది విజయవంతం కావటంతో ప్రజలందరినీ యాపిల్ పండ్ల పంట వైపు ప్రోత్సహించారు. అలా హిమాచల్‌ప్రదేశ్‌కు యాపిల్‌ను పరిచయం చేసిన ఘనత స్టోక్స్‌దే! తనకున్న పరిచయాలతో దిల్లీకి వాటిని ఎగుమతి చేయించి.. స్థానికులకు మంచి లాభాలు తెచ్చి పెట్టారు. పూర్తిగా భారత్‌లో మమేకమైన స్టోక్స్ జాతీయోద్యమంలోకి కూడా ప్రవేశించారు. గాంధీజీ పిలుపందుకొని ప్రజల కోసం నిలబడ్డారు.