ఎయిర్ఇండియా విమానంలో మూత్రవిసర్జన ఘటన మరవకముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. నిందితుడు అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి అని ఓ విమానాశ్రయ అధికారి తెలిపారు. మూత్రం పోసిన సమయంలో అతడు తాగిన మైకంతో నిద్రిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, బాధితుడు మాత్రం దీన్ని పోలీసుల వరకు తీసుకెళ్లాలని భావించలేదని తెలుస్తోంది. నిందితుడు క్షమాపణలు చెప్పడం వల్ల.. ఇది వివాదంగా మారితే తన కెరీర్‌కు ముప్పని ప్రాధేయపడ్డట్లు సమాచారం. కానీ, విమాన సిబ్బంది మాత్రం ఈ విషయాన్ని వెంటనే పైలట్ ద్వారా దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు సీఐఎస్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కాగానే నిందితుణ్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించగా.. విచారణ చేపట్టారు.
"అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 292 విమానం జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరింది. అయితే ఓ ప్రయాణికుడు మద్యం అతిగా తాగి.. విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. సిబ్బంది సూచనలు చేసినా పట్టించుకోకుండా వారితో వాగ్వాదానికి దిగాడు. విమాన నిబంధనలు ఉల్లఘించి తోటి ప్రయాణికులతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు. 15G నంబర్ సీట్లో కూర్చున్న వ్యక్తిపై మూత్రం పోశాడు."
---అమెరికన్ ఎయిర్‌లైన్స్