Amartya Sen Death Fake News : నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ అర్థిక వేత్త అమర్త్యసేన్ మరణ వార్తలను ఆయన కుమార్తె నందనా దేబ్ సేన్ ఖండించారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. అమర్త్యసేన్ మరణించారంటూ ఆంగ్ల మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పష్టత ఇచ్చారు. సోమవారం రాత్రివరకు అమర్త్యసేన్ తన వద్దే ఉన్నారని నందన తెలిపారు.
'ఇదంతా ఫేక్ న్యూస్. బాబా(అమర్త్యసేన్) క్షేమంగా ఉన్నారు. తప్పుడు వార్తలన్నింటినీ వ్యాప్తి చేయడం మానేయమని అభ్యర్థిస్తున్నా. నేను మా కేంబ్రిడ్జ్ హోమ్‌లో నాన్నతో ఒక వారం గడిపాను. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో రెండు కోర్సులు బోధిస్తున్నారు' అని నందన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అమర్త్యసేన్ మృతి చెందినట్టు వచ్చిన వదంతులతో పలువురు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయన పూర్తిగా క్షేమంగానే ఉన్నట్టు అమర్త్యసేన్ కుమార్తె స్పష్టత ఇవ్వడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అంతకుముందు అమర్త్యసేన్ మరణించారని ఈ ఏడాది ఆర్థికశాస్త్ర విభాగంలో నోబెల్ పొందిన చౌడీయా కాల్డియా గోల్డిన్ పేరుతో ఉన్న ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. 'ఒక భయంకరమైన వార్త. నా ప్రియమైన ప్రొఫెసర్ అమర్త్యసేన్ కొద్ది సేపటి క్రితం మరణించారు. మాటలు లేవు.' అని ట్వీట్లో ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అమర్త్యసేన్ మరణవార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి.