2022 శాసనసభ ఎన్నికలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్‌లో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తనపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న సొంత పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కనుందన్న ఊహాగానాల మధ్య దీన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది.
సోనియాకు పంజాబ్ సీఎం ఘాటు లేఖ - అమరీందర్ సింగ్
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఘాటు లేఖ రాశారు. సిద్ధూకు పంజాబ్ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది.
పంజాబ్ సీఎం, అమరీందర్ సింగ్
పంజాబ్ కాంగ్రెస్‌లో హిందువులు, దళితులతో కూడిన సీనియర్ నేతలను విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన ప్రతికూల ప్రభావం ఉండగలదని అమరీందర్ ఈ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్యే కాంగ్రెస్ ఆ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు హరీశ్ రావత్ నేడు పంజాబ్ రానున్నట్లు సమాచారం.
సిద్ధూకు పీసీసీ పగ్గాల అప్పగింతపై ప్రకటన వస్తుందని భావిస్తుండగా, రావత్ ఇవాళ సీఎం అమరీందర్‌తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకు ముందు సోనియా గాంధీతో సిద్ధూ శుక్రవారం సమావేశమయ్యారు.