పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా (Amrinder Singh resignation) చేశారు. సీఎల్పీ భేటీకి ముందే గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. ఇప్పుడు తర్వాతి సీఎం (Punjab New CM) ఎవరన్న అంశం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి పదవి కోసం ఆశావాహులు అనేక మంది ఉన్నప్పటికీ.. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. పీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, మంత్రి సుఖిందర్ రంధవా, మాజీ ముఖ్యమంత్రి రాజేందర్ కౌర్ భట్టల్లో ఒకరిని కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసే అవకాశం ఉందని హస్తం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తుది నిర్ణయం సోనియాదే
మరోవైపు, చండీగఢ్‌లో భేటీ అయిన కాంగ్రెస్ శాసనసభాపక్షం.. కొత్త సీఎల్పీ నేతను ఎన్నుకునే అధికారాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కట్టబెట్టింది. ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో.. అమరీందర్ పనితీరును ప్రశంసిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించారు. అమరీందర్ సింగ్ మార్గనిర్దేశం పార్టీకి కొనసాగుతుందని మాకెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సమావేశానికి 78 మంది హాజరయ్యారు.
అసంతృప్తితో రాజీనామా
కాంగ్రెస్ దిల్లీ అధిష్ఠానం తన పట్ల వ్యవహరించే విధానంపై అమరీందర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంతోనే రాజీనామా చేశారు. తనను అవమానించారని కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి రాజీనామా అనంతరం వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఇదీ చదవండి:సీఎంపై మంత్రులు, ఎమ్మెల్యేల తిరుగుబాటు