Amarinder Singh: భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ గెలుపు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. దీంతో అధికార పార్టీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఈ రేసులో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయం శనివారం వెల్లడించింది. అమరీందర్ సింగ్ తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కార్యాలయం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
ప్రస్తుతం అమరీందర్ సింగ్ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లారు. గత ఆదివారం ఆపరేషన్ పూర్తయిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు సమాచారం. లండన్ నుంచి తిరిగివచ్చిన తర్వాత కెప్టెన్ తన 'పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ)' పార్టీని భాజపాలో విలీనం చేయనన్నట్లు శుక్రవారం పలు మీడియా ఛానళ్లలో కథనాలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే మోదీతో అమరీందర్ మంతనాలు జరిపినట్లు సమాచారం. విలీనం అనంతరం కెప్టెన్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.
ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్.. గతేడాది హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. అప్పటి పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. పాటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్ కూడా ఓటమిపాలవ్వడం గమనార్హం.