ఏదో ఒత్తిడిలో ఉన్న కారణంగానే ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్(Captain Amarinder Singh Latest News) రాజీనామా చేశారన్న పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి హరీశ్ రావత్(Harish Rawat on Punjab) వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను అమరీందర్‌సింగ్ ఎద్దేవా చేస్తూ.. ఒత్తిడి కారణంగానే రాజీనామా చేశానని, కానీ తనపై ఉన్న ఏకైక ఒత్తిడి కాంగ్రెస్‌పై తనకున్న విధేయత అని పేర్కొన్నారు. అందువల్లే ఇన్నిరోజులు ఎవరు ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించానని తెలిపారు. రావత్ వాదనలు, ఆరోపణలు దారుణంగా ఉన్నాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్‌సింగ్(Amarinder Resigns) రాజీనామా చేసిన మరుసటి రోజే హరీశ్ రావత్ స్పందించారు. ఆయనను ఎవరూ అవమానించలేదని, మొండితనంగా ప్రవర్తిస్తూ ఎమ్మెల్యేల మద్దతును ఆయన ఎలా కోల్పోయారో వివరంగా తెలియజేస్తూ ఓ ప్రకటన జారీ చేశారు. దీనిపై స్పందించిన అమరీందర్.. హరీశ్ రావత్ వ్యాఖ్యలే ప్రస్తుతం కాంగ్రెస్ ఉన్న దీన పరిస్థితిని వివరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అంత పట్టు ఉంటే తాను సీఎంగా ఉన్న సమయంలో సిద్ధూ నేతృత్వంలోని రెబల్ అభ్యర్థులు సొంత పార్టీపైనే ఎలా విమర్శలు చేయగలిగారో చెప్పాలని కోరారు.
ముందురోజే..
సీఎల్పీ సమావేశానికి ముందురోజే కాంగ్రెస్ ఇంఛార్జి తనతో మాట్లాడినట్లు కెప్టెన్ తెలిపారు. 'సీఎల్పీ మీటింగ్‌కు ముందురోజే రావత్ నాతో మాట్లాడారు. 43 ఎమ్మెల్యేలు ఓ లేఖ రాసినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయన అబద్ధాలు ఆడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది' అని పేర్కొన్నారు. 'సీఎం పదవి నుంచి వైదొలిగే మూడు వారాల ముందే నా రాజీనామా విషయాన్ని సోనియా గాంధీకి తెలియజేశాను. పదవిలో కొనసాగాలని ఆమె కోరారు. కానీ నాకు జరిగిన అవమానాలను ప్రపంచం చూసింది. రావత్ ఆరోపణలు బాధాకరం' అని వ్యాఖ్యానించారు.