Amaravati Farmers Protest Reached 1300 Days: ఎండా, వానను లెక్కచేయకుండా.. పోలీసుల ఆంక్షలు... లాఠీ దెబ్బలకు వెరవకుండా.. ఏకైక రాజధాని కోసం అమరావతి రైతులు పోరాడుతూనే ఉన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధృడ సంకల్పంతో 1300 రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆర్-5 జోన్ అని.. రాజధానిలో పేదలకు సెంటు భూములంటూ.. అమరావతి మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడుతున్నారు.
రాష్ట్ర భవిష్యత్ కోసం భూములిచ్చి తాము చేసిన త్యాగాలను పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేశారు. దేవుడే దిక్కు అంటూ ఆలయాలనూ సందర్శించారు. 1300వ రోజు ఉద్యమంలో భాగంగా... 'నాలుగేళ్ల నరకంలో నవ నగరం' పేరిట మందడంలో 29 గ్రామాల రైతులు కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు మద్దతుగా అఖిపక్షాలు, ప్రజా, రైతు సంఘాలు నిరసనల్లో పాల్గొన్నాయి. సేవ్ అమరావతి-బిల్డ్ అమరావతి అంటూ తెలంగాణ రైతులు సైతం అమరావతికి జేజేలు పలికారు.
1300 రోజులుగా పోరాడుతున్నా.. ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని రైతులు మండిపడ్డారు. సీఎం తప్పుడు నిర్ణయం భస్మాసుర హస్తంగా మారుతుందని హెచ్చరించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతిని విచ్ఛిన్నం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు. అమరావతిపై సీఎం జగన్ మాట తప్పారని అఖిలపక్షాలు, రైతు సంఘాల నేతలు మండిపడ్డారు.