Alwar Girl Case: రాజస్థాన్ అల్వర్లో 14 ఏళ్ల దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం కేసుపై రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు(సీబీఐ) అప్పగించాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అధ్యక్షతన ఆదివారం జరిగిన క్షేత్రస్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే.. దివ్యాంగ బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని ఇటీవల పోలీసులు స్పష్టం చేశారు. ఐదుగురు డాక్టర్ల బృందం జైపుర్లోని జేకే లోన్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని నిర్ధరించినట్లు చెప్పారు. అయితే బాలిక ప్రైవేటు భాగాలపై తీవ్ర గాయాలున్నాయని, వాటికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
తదుపరి విచారణలో ఆ విషయం తెలిసే అవకాశముందని పేర్కొన్నారు. అంతేగాక బాలిక తనంతట తానే గ్రామం నుంచి పట్టణానికి వెళ్లిందని విచారణలో తెలిసిందని పోలీసులు వెల్లడించారు.