Aluva Murder Case Judgement : కేరళలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు అస్ఫాక్ ఆలమ్‌కు ఎర్నాకులం పోక్సో కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆరు లక్షల రూపాయల జరిమానా కూడా వేసింది. దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం జరుగుతున్న వేళ.. కోర్టు ఈ తీర్పునివ్వడం విశేషం.
కేరళ హైకోర్టు నిర్ధరించిన తర్వాత..
Aluva Murder Case News :బిహార్‌కు చెందిన ఐదేళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ ఆలమ్‌ను ఉరితీయాలని ప్రత్యేక పోక్స్ కోర్టు జడ్జి కె.సోమన్ ఆదేశించినట్లు ప్రభుత్వ న్యాయవాది జి.మెహన్‌రాజ్ తెలిపారు. కేరళ హైకోర్టు నిర్ధరించిన తర్వాత మరణశిక్షను అమలు అవుతుందని ఆయన చెప్పారు. భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం ప్రకారం నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించినట్లు వెల్లడించారు.
'బాలల దినోత్సవం నాడు తీర్పు.. వారికి గట్టి హెచ్చరిక'
చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించడంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. అత్యంత దారుణమైన నేరానికి చిన్నారి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థుడిని పట్టుకుని గరిష్ఠంగా శిక్ష పడేలా న్యాయ వ్యవస్థ మొత్తం సమర్థంగా పనిచేసిందని కొనియాడారు. బాలల దినోత్సవం రోజున వెలువడిన ఈ తీర్పు.. హింసకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా భావించాలని ఆయన తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమని.. ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయం చేస్తుందని చెప్పారు.