Alternative Dispute Resolution: లక్షలాది మంది ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారమార్గం ఏడీఆర్‌కు దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే సామర్థ్యం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. భాగస్వామ్య పక్షాల అందరి సహకారంతో భారతదేశ సామాజిక న్యాయ సాధనంగా ఏడీఆర్ రూపొందే అవకాశం ఉందని అన్నారు. ఏడీఆర్ భావనకు లోక్ అదాలత్‌లు, గ్రామ న్యాయాలయాలు, మధ్యవర్తిత్వ కేంద్రాల ద్వారా దేశ న్యాయపరమైన ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఉందని సీజేఐ అన్నారు.
"మధ్యవర్తిత్వం విఫలమైతే పరిణామాలు ఎలా ఉంటాయనేది మనందరికీ తెలుసు. కృష్ణ భగవానుడు విజయవంతమై ఉంటే (మధ్యవర్తిత్వంలో) ఎంత విధ్వంసం తప్పిపోయి ఉండేదో, ఎన్ని ప్రాణాలు నిలబడగలిగేవో, ఎన్ని రాజ్యాలు సుసంపన్నంగా ఉండేవో ఊహించండి. తప్పుగా అర్థం చేసుకోవడం, అహంకారం, నమ్మకం లేకపోవడం, దురాశ వివాదాలకు దారితీస్తాయి. సరిగా అర్థం చేసుకుంటే పెద్ద పెద్ద సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. వ్యాజ్యం కంటే ముందుగానే మధ్యవర్తిత్వం, చర్చలు ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడమనేది అత్యంత సాధికార పద్ధతి."