Mohammed Zubair case:అరెస్టైన ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్‌కు న్యాయస్థానం మరో నాలుగురు రోజుల రిమాండ్ విధించింది. ఒకరోజు కస్టోడియల్ విచారణ ముగిసిన నేపథ్యంలో ఆయన్ను మంగళవారం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ముందు దిల్లీ పోలీసులు హాజరుపర్చారు. పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరగా.. కోర్టు నాలుగు రోజుల పాటు రిమాండ్‌ను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఓ దేవతపై అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
Mohammed Zubair Tweet 2018:జుబైర్ చేసిన ట్వీట్ వల్ల ట్విట్టర్లో విద్వేష ప్రసంగాలు వెల్లువెత్తాయంటూ దిల్లీ పోలీసులు చెప్పుకొచ్చారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. 'ఇలాంటి కేసుల్లో ట్వీట్ చేసిన గ్యాడ్జెట్, ఆ పోస్ట్ వెనక ఉన్న కారణం చాలా ముఖ్యం. ఇంటరాగేషన్‌లో నిందితుడు రెండు అంశాల్లో సరిగా సమాధానం చెప్పలేకపోయారు. ఆయన ఫోన్ ఫార్మాట్ అయింది. తప్పించుకునే విధంగా ప్రవర్తించడం వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది. నిందితుడిపై పలు కేసులు నమోదైతే.. అన్నింటిపై ప్రశ్నలు అడగడం మా హక్కు. ఈ ప్రక్రియలో న్యాయస్థానం కూడా భాగమే. ఇప్పటికే కస్టడీ విధించింది. నిందితుడికి బెయిల్ రాలేదు. ఇంకొన్ని రోజులు రిమాండ్ విధించాలని కోర్టును కోరనున్నాం. దీన్ని రాజకీయ ప్రోద్బలంతో నమోదు చేసిన కేసుగా చూడటం సరికాదు' అని ఐఎఫ్ఎస్ఓ డీసీపీ కేపీఎస్ మల్హోత్ర వివరించారు.
Mamata banerjee on zubair case:జుబైర్ అరెస్టును బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. 'జుబైర్‌ను, తీస్తా సీతల్వాద్ను ఎందుకు అరెస్టు చేశారు? వారు చేసిన తప్పేంటి? నిజం మాట్లాడటం.. నిజాన్ని గుర్తించి చెప్పడమే నేరమా? భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారందరినీ వేధింపులకు గురిచేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు, విద్వేష ప్రసంగాలు చేసినవారు విచ్చలవిడిగా తిరుగుతున్నారని దీదీ మండిపడ్డారు. మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మపై చర్యలు ఎలాంటి తీసుకోలేదని పరోక్షంగా పేర్కొన్నారు.
అగ్నిపథ్‌పై విమర్శలు చేసిన దీదీ.. అగ్నివీరుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్ల పాటు పనిచేసిన అగ్నివీరులకు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈ సమస్య కేంద్రం వల్ల తలెత్తిందని.. వారే పరిష్కరించాలని స్పష్టం చేశారు.