అందమైన మంచు పర్వతాలపై నడుస్తున్న ఈ అమ్మాయి పేరు.. నమ్రత నందీష్. బెంగళూరుకు చెందిన ఈమె ఐటీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. కళాశాల వయసు నుంచే ఈమెకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ఉద్యోగ జీవితం మొదలవడం.. ఇంటి బాధ్యతలతో కూడిన గజిబిజి జీవితం ఆమె అభిరుచులకు, ఇష్టాలకు బ్రేక్ వేసింది. అయితే, మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం.. ఆ సమయాన్ని పాత ఇష్టాల వైపు మళ్లించింది.
పక్కాగా ప్లాన్ అంటూ లేదు. శ్రీనగర్‌ను సందర్శించాలనే ఆలోచనతో ఇదంతా ప్రారంభమైంది. గడ్డకట్టిన దాల్ సరస్సును చూడాలనుకుని బయలుదేరింది. అలా.. జనవరి 26న కశ్మీర్ లోయకు జర్నీ ప్రారంభించింది నమ్రత.
ట్రెక్కింగ్ కోసం కశ్మీర్‌కు వెళ్లి.. దక్షిణ కశ్మీర్, పహల్గామ్ ప్రాంతంలోని పీర్ పంజాల్, జంస్కార్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న తులియన్ సరస్సుతో ప్రారంభించింది నమ్రత. అనంతనాగ్- కిష్త్‌వర్ ప్రాంతంలోని శిల్సార్ సరస్సు వరకు 4 నెలల్లో 50 సరస్సులను చుట్టేసింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిందీ యువతి.
సముద్ర మట్టానికి 10 వేల అడుగులో ఎత్తులో ఉండే ఈ సరస్సులను ఆల్పైన్ సరస్సులు అంటారు. వీటిని ట్రెక్కింగ్ చేయడం ద్వారా ట్రెక్కింగ్ కమ్యూనిటీ నమ్రతకు ఆల్పైన్ గర్ల్‌గా కితాబునిచ్చింది.