కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.
లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?
- తెలంగాణలో బుధవారం నుంచి లాక్‌డౌన్ అమలు కానుంది. 10 రోజుల పాటు ఆంక్షలు ఉండనున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
- దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను రద్దు చేశారు.
- తమిళనాడు, రాజస్థాన్, పుదుచ్చేరిలో సోమవారం నుంచి లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి.
- హరియాణాలో ఈనెల 17 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ అమలు చేశారు.
- కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరంలో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతోంది.
- బిహార్‌లో ఈ నెల 15 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది.
- ఒడిశాలో 14 రోజుల లాక్‌డౌన్ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది.
- నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి రానుంది. వారం పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది.
వారాంతాల్లో..
- చండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. మే 11నుంచి మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్‌ను కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
- ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
- పంజాబ్‌లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.