Alluri Sitarama Raju Azadi Ka Amrit Mahotsav: అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లా పాండ్రంగిలో 125 సంవత్సరాల క్రితం 1897 జులై 4న జన్మించారు. తల్లిదండ్రులు వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ. సోదరుడు సత్యనారాయణ, సోదరి సీతమ్మ. తండ్రి రాజమహేంద్రవరం జైలు ఫొటోగ్రాఫర్. అల్లూరి ఎనిమిదేళ్ల వయసులో ఆయన చనిపోయారు. చిన్నాన్న సాయంతో రాజమహేంద్రవరం, కాకినాడ, తుని, రామచంద్రపురం, నరసాపురంలో చదువుకున్న రామరాజు తునిలో విలువిద్య, గుర్రపుస్వారీ నేర్చుకున్నారు. చిన్నాన్నకు రంపచోడవం బదిలీ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు. ఆయుర్వేదం, జోతిషం, హస్తసాముద్రికమూ అభ్యసించారు. విశాఖలోని ఎ.వి.ఎన్. కళాశాలలో చేరి, చదువును మధ్యలోనే ఆపేశారు. 18 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. తర్వాత తన తండ్రి స్నేహితుడికి పైడిపుట్టలో ఉన్న భూమిలో వ్యవసాయం చేశారు.
అధ్యయనం.. ఆపై ఉద్యమం
సీతారామరాజుకు తనచుట్టూ జరిగే విషయాలను నిశితంగా గమనించే అలవాటుంది. బ్రిటిషర్ల పాలన కారణంగా దేశానికి జరుగుతున్న నష్టంపై తెలుసుకోవడానికి 1916లో బెంగాల్ వెళ్లి నాటి కాంగ్రెస్ నేత సురేంద్రనాథ్ బెనర్జీని కలిశారు. వివిధ గిరిజనోద్యమాలను అధ్యయనం చేశారు. విశాఖ, రేకపల్లి, భద్రాచలం, ఛోటానాగ్‌పుర్, బిహార్, బెంగాల్, ఒడిశా, బస్తర్‌లలో జరిగిన తిరుగుబాట్ల అనుభవాలను తెలుసుకున్నారు.
స్వరాజ్యం లాక్కోవాల్సిందే
బ్రిటిషర్లు 1882లో తీసుకొచ్చిన అటవీ చట్టంతో గిరిజనుల బతుకులు భారమయ్యాయి. పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. గిరిజనులను రోడ్ల నిర్మాణంలో కూలీలుగా మార్చారు. అదేసమయంలో ఏజెన్సీలో తరతరాలుగా ఉన్న శిస్తు వసూలుదారులను కూడా తొలగించారు. అటవీ సంపదను తరలించడానికి మన్యంలో రోడ్లు వేస్తున్నప్పుడు కూలీలపై కాంట్రాక్టర్ల దురాగతాలు పెచ్చుమీరాయి. పోలీసులు కాంట్రాక్టర్లకే మద్దతివ్వడంతో గిరిజనుల్లో అసంతృప్తి పెరిగింది. ఆ సమయంలో గిరిజనుల పక్షాన నిలవడానికి సీతారామరాజు అడవిబాట పట్టారు. గిరిజనులు, శిస్తు వసూలుదారులతో కమిటీలు వేశారు. స్వరాజ్యం అడుక్కుంటే రాదని, లాక్కోవాల్సిందేనని అల్లూరి బలంగా నమ్మేవారు. ఈ లక్ష్య సాధనకు ఆయుధాలు ఉండాలని నిర్ణయించి, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక నాయకులతో సైన్యం ఏర్పాటు చేశారు.