All Women Team Satellite :అద్భుతమైన ఆవిష్కరణలతో అంతరిక్ష రంగంలో భారత్ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో మహిళలు సైతం ఆకాశమే లక్ష్యంగా ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు. అలాంటి కోవకు చెందిన మహిళల బృందం తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ఆంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ సాటిలైట్ను ఇస్రో రేసుగుర్రం పీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా నింగిలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగం ఆక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారంలో చేపట్టే అవకాశం ఉంది.
తిరువనంతపురంలోని పూజప్పురాలో ఉన్న ఎల్బీఎస్ మహిళల ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఓ బృందంగా ఏర్పాడి స్పేస్ క్లబ్‌ను స్థాపించారు. వీరంతా కలిసి 'వియ్‌శాట్' (WESAT) అనే ఉపగ్రహాన్ని స్వయంగా డిజైన్ చేసి.. అభివృద్ధి చేశారు. కేరళ వాతావరణ మార్పులపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని గమనించే ఉద్దేశంతో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. బాహ్య అంతరిక్షంలో, భూఉపరితలంపై అతినీలలోహిత రేడియేషన్ స్థాయిని కొలవడం.. దాని వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. కాలేజీ క్యాంపస్‌లో ఇన్స్టాల్ చేసిన పరికరాల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎల్బీఎస్ ఇంజినీరింగ్ విద్యార్థినులు ఉపగ్రహాన్ని తయారుచేసిన విషయం తెలిసిన తర్వాత.. మిగతా కాలేజీల విద్యార్థులు కూడా ఈ సాటిలైట్ గురుంచి చాలా ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఉత్సాహంగా తెలుసుకుంటున్నారు. అయితే, ఈ 'వియ్‌శాట్' తయారుచేయడానికి ఎల్బీఎస్ కాలేజీ విద్యార్థినులు మూడేళ్లు కష్టపడ్డారు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఇస్రోకు లేఖ రాశారు. అనంతరం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో ఆ ప్రయత్నం పూర్తయింది. ఈ మేరకు ఎల్బీఎస్ కాలేజీ, ఇస్రో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.