తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ పెట్టినవన్నీ తప్పుడు కేసులే: ఆడిటర్లు, న్యాయవాదులు

Margadarshi Chitfunds latest updates: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలపై సీఐడీ అధికారులు పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులేనని.. ఆడిటర్లు, న్యాయవాదులు స్పష్టతనిచ్చారు. చిట్‌ఫండ్స్‌పై సీఐడీ అధికారులకు కనీస పరిజ్ఞానం లేదని వ్యాఖ్యనించారు. మార్గదర్శి సంస్థల విషయంలో సీఐడీ వ్యవహరిస్తున్న తీరుపై ఆడిటర్లు, న్యాయవాదులు మీడియా ముందు పలు సంచలన విషయాలను వెల్లడించారు.

Auditors and lawyers
Auditors and lawyers

By

Published : Apr 10, 2023, 7:53 PM IST

Updated : Apr 11, 2023, 6:46 AM IST

Margadarshi Chitfunds latest updates: ఆంధ్రప్రదేశ్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థల విషయంలో సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థలపై సీఐడీ ఇప్పటివరకు నమోదు చేసిన కేసులకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ, ఆడిటర్ దామచర్ల శ్రీనివాసరావు సంచలన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శిపై సీఐడీ అధికారులు కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. మార్గదర్శి సంస్థలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కావాలనే మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సీఐడీని అడ్డుపెట్టుకుని మార్గదర్శిని ఇబ్బంది పెడుతున్నారు వ్యాఖ్యనించారు. మార్గదర్శి ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. మార్గదర్శి సంస్థల వల్ల ఇప్పటివరకు ఎవరూ ఇబ్బంది పడలేదని..హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఖాతాదారులను బెదిరించి ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని.. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యనించారు.

అనంతరం దామచర్ల ఆడిటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..''మార్గదర్శిపై సీఐడీ పెట్టినవన్నీ తప్పుడు కేసులే. చిట్‌ఫండ్స్‌పై సీఐడీ అధికారులకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. మచ్చ లేని రామోజీ రావు గురించి ప్రజలందరికీ తెలుసు. మార్గదర్శి సంస్థ.. డిపాజిటర్స్ చట్టం పరిధిలోకి రాదు. డిపాజిటర్ల చట్టం కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు'' అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, మార్గదర్శి వివిధ బ్రాంచీల్లో సీఐడీ అధికారులు సోదాలు చేస్తూ.. వివిధ ఆరోపణలు చేస్తూ నవంబరులో నోటీసులు ఇచ్చారన్నారు. సెక్షన్‌ 46 కింద మాత్రమే నోటీసులు ఇవ్వాలనే నియమం ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలను విస్మరించారని తెలిపారు. మార్గదర్శిలో పనిచేసే పలువురు బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేశారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ 60 ఏళ్ల క్రితమే ప్రారంభమైందన్నారు. మూడు తరాలకు అనుబంధంగా నిలిచిన సంస్థ.. మార్గదర్శి అని గుర్తు చేశారు. మార్గదర్శి సంస్థలో దాదాపు 2 లక్షల మంది ఖాతాదారులున్నారన్నారు. ఒక్క ఖాతాదారు కూడా ఇంతవరకూ మార్గదర్శిపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టతనిచ్చారు. కానీ, కొంతమంది అధికారులు ఫిర్యాదు ఇవ్వాలంటూ పలువురు ఖాతాదారులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

చిట్స్‌లో ఏమైనా అవకతవకలు జరిగితేనే కేసు నమోదు చేయాలి తప్ప..సీఐడీతో కేసులు నమోదు చేయించి విచారణ చేయడం చట్టవిరుద్ధమన్నారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యేకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని గుర్తు చేశారు. మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సీఐడీ అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. మనీలాండరింగ్ వ్యవహారంలోనే డిపాజిటర్ల చట్టం కింద కేసు నమోదు చేయాలని, రిమాండ్ రిపోర్టును తిరస్కరించినా కూడా సీఐడీ అధికారులు ముందుకెళ్తున్నారన్నారు.

''బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సోదాలు జరుపుతామని నోటీసు ఇచ్చారు. సోదాలు ఆపాలని తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో విధించింది. కంపెనీ లా కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలు చర్యలు తీసుకోవచ్చు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్లే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రామోజీరావు సంస్థలపై దాడులు చేస్తున్నారు. తెలుగు భాషను కాపాడేందుకు రామోజీరావు ఎప్పుడూ ముందుంటారు.

ఈనాడులో వచ్చిన వార్తలు చూసి తెలుగులో తీర్పులు కూడా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై పలువురి ఇళ్లలో సీఐడీ తనిఖీలు చేసింది. రూ.వేల కోట్లను దారి మళ్లించారని కాగ్‌ నివేదిక చెప్పింది. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వచ్చాయి. లా అండ్ ఆర్డర్ కేసులు కూడా సీఐడీ చేపట్టడం దారుణం. ఖాతాదారులను సీఐడీ అధికారులు బెదిరిస్తున్నారు. సీఐడీ ఒత్తిడికి మార్గదర్శి ఖాతాదారులు ఎవరూ భయపడవద్దు. రాష్ట్ర ప్రజలను ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్‌ కేసుల గురించి ఉండవల్లి మాట్లాడారు. శంకరరావు లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ప్రాథమిక దర్యాప్తు చేశాకే జగన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

వేంకటేశ్వరస్వామికి జరిమానా అంటూ ఉండవల్లి మాట్లాడారు. టీటీడీ అధికారులకు నోటీసు వచ్చింది.. టీటీడీ నుంచి జరిమానా కట్టారు.. పూజారి, ఈవో తప్పు చేస్తే.. వేంకటేశ్వరస్వామి తప్పు చేసినట్లా.. దేవుడిని అడ్డం పెట్టుకుని వెటకారాలు చేయవద్దని ఉండవల్లిని కోరుతున్నాం. వ్యక్తిగత అజెండాతోనే ఉండవల్లి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మార్గదర్శిపై పెట్టిన కేసులు నిలిచే పరిస్థితి లేదు.

సీఐడీ అధికారులకు ఆడిటింగ్‌ గురించి ఎలా తెలుస్తుంది?. బ్యాంకు పనివేళల్లోనే చెక్కులు ఇస్తారని కూడా అధికారులకు తెలియదు. రాష్ట్ర ప్రజల నమ్మకానికి మారుపేరు.. రామోజీరావు సంస్థలు. తెల్లటి కాగితంపై మచ్చ పెట్టాలనే దురుద్దేశంతోనే తప్పుడు కేసులు. బ్రాంచి నుంచి ప్రధాన కార్యాలయానికి నిధులు బదిలీ కావడం సహజం. డిపాజిటర్ల చట్టం కిందకు రాని విషయంపైనా కేసు నమోదు చేశారు. విచారణలో ఒక్క కేసు కూడా నిలబడదు'' అని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ, ఆడిటర్ దామచర్ల శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 11, 2023, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details