అసోం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 126 స్థానాలున్న అసోం శాసనసభకు మూడు విడతల్లో.. మార్చి 27, ఏప్రిల్ 1, 6 తేదీల్లో పోలింగ్ జరిగింది. ఇక్కడ ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 64 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.
అసోం సమరం..
- మొత్తం సీట్లు: 126
- మ్యాజిక్ ఫిగర్: 64
- పోలింగ్:3 విడతలు
- ప్రధాన పోటీ: భాజపా-ఏజీపీ, కాంగ్రెస్ మహాకూటమి, అసోం జాతీయ పరిషత్
ఈసీ చర్యలు..
కరోనా నిబంధనల నడుమ కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపట్టింది. ఫేస్ షీల్డ్స్, మాస్కుల పంపిణీ, శానిటైజేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు, వారి ఏజెంట్లు.. కచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్టును చూపించాలి. లేదా టీకా రెండు డోసులు తీసుకున్నట్టు ధ్రువపత్రాలను సమర్పించాలి.