భాజపా తరపున ప్రధాని మోదీ 20 బహిరంగ సభలు..
కేంద్ర మంత్రులు, సీఎంలు జాతీయ స్థాయి నేతల ప్రచారాలు
కనీసం 300 ప్రచార సభలు నిర్వహించాలని మమతా బెనర్జీ నిర్ణయం..
ఇలా.. బంగాల్లో ఎన్నికల సమరశంఖం మోగిన వేళ పార్టీలన్నీ ప్రచార పర్వానికి పదును పెడుతున్నాయి. మరో మూడు రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నప్పటికీ అందరి దృష్టి బంగాల్‌పైనే నెలకొంది. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, అధికారంలోకి రావాలనుకుంటున్న భాజపా, కాంగ్రెస్-లెఫ్ట్ కూటములు రాష్ట్రంలో ప్రచారానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి.
ఎన్నికల తేదీ ప్రకటించడానికి నెలల ముందు నుంచే ఇక్కడ రాజకీయం అగ్నిగుండాన్ని తలపించింది. అభ్యర్థుల పేర్లనూ ఖరారు చేస్తున్న ఈ సమయంలో ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంటోంది. ప్రతి నియోజకవర్గంలో మమతా బెనర్జీ ప్రచారం చేయనుండటం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా 20 బహిరంగ సభల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానుండటాన్ని బట్టి చూస్తే ఇక్కడి రాజకీయాలపై ఆయా పార్టీల శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారనే విషయం అర్థమవుతుంది.
మోదీ ఇమేజ్‌తో భాజపా
రాష్ట్రంలో టీఎంసీకి ప్రధాన పోటీదారుగా మారుతోంది భాజపా. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 శాతం ఓట్ల షేర్‌తో 16 స్థానాలను కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరపురాని విజయం సాధించాలని ఆకాంక్షిస్తోంది. అందుకు అనుగుణంగానే కార్యాచరణ చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలను చేపట్టింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బంగాల్లోనే మకాం వేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను రంగంలోకి దించుతున్నారు. ప్రధాని మోదీ ఏకంగా 20 ప్రచార సభలలో పాల్గొనేలా ప్రణాళికలు రచించారు.
బంగాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఇప్పటివరకు ప్రకటించని భాజపా.. రాష్ట్రంలో ప్రచారాన్ని 'దీదీ వర్సెస్ మోదీ'గానే నడిపిస్తోంది. భాజపా శిబిరంలోని ఉద్ధండులందరినీ రంగంలోకి దించుతోంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు ఇతర మంత్రులు, జాతీయ స్థాయి నేతలను రాష్ట్రానికి రప్పిస్తోంది. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బంగాల్లో పర్యటించారు. మరికొందరు ముఖ్యమంత్రులు సైతం ప్రచారంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
బంగాల్ సభలో యోగి ఆదిత్యనాథ్ టీఎంసీకి అన్నీ దీదీనే
రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌ను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముందుండి నడిపిస్తున్నారు. అన్నీ తానై ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా భాజపా నేతల విమర్శలను సమర్థంగా తిప్పికొడుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ముఖచిత్రంగా కొనసాగుతున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క సభలోనైనా పాల్గొనాలని దీదీ నిశ్చయించుకున్నారు. పార్టీ అభ్యర్థులందరి తరపునా ప్రచారాల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు.
మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి రాష్ట్రంలో 294 నియోజకవర్గాలు ఉండగా.. కనీసం 300 బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనాలని మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారని టీఎంసీ వర్గాలు 'ఈటీవీ భారత్'తో చెప్పాయి. అయితే, అత్యంత కీలకంగా పరిగణిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ప్రచారం చేయరని తెలిపాయి. నందిగ్రామ్‌లో తాను విజయం సాధించాలో లేదో అన్న నిర్ణయాన్ని అక్కడి ప్రజలకే వదిలేశానని మమత చెబుతున్నట్లు వెల్లడించాయి. సుబ్రతా ముఖోపాధ్యాయ్, కునాల్ ఘోష్, సుబ్రతా బక్షి వంటి కీలక నేతలకు నందిగ్రామ్‌లో తన తరఫున ప్రచారం చేసే బాధ్యత దీదీ అప్పగించినట్లు తెలిపాయి.
నందిగ్రామ్‌లో నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 12 వరకు గడువు ఉంది. ఆ లోపు కేవలం ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని టీఎంసీ అగ్రనేత ఒకరు చెప్పారు. ఊరేగింపుగా వెళ్లి నామపత్రాలను దాఖలు చేస్తారని స్పష్టం చేశారు.
ఆకర్షణీయ నేతలు!
టీఎంసీలో దీదీతో పాటు మరికొందరు హైప్రొఫైల్ నేతలు సైతం ప్రచారానికి వన్నెతీసుకురానున్నారు. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే ప్రచారాన్ని నడిపిస్తున్నారు. సుబ్రతా బక్షి, పార్థా ఛట్టోపాధ్యాయ్, పిర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, సుబ్రతా ముఖర్జీ, సౌగతా రాయ్, చంద్రిమా భట్టాచార్య రంగంలోకి దిగనున్నారు. వీరితో పాటు.. వెండితెర నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నుస్రత్ జహాన్, మిమి చక్రబర్తి వంటి వారు కూడా ప్రచారానికి అదనపు హంగులు తీసుకురానున్నారు.
నుస్రత్ జహాన్, టీఎంసీ ఎంపీ కాంగ్రెస్-లెఫ్ట్?
భాజపా, టీఎంసీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన కాంగ్రెస్-వామపక్షాలు-ఐఎస్ఎఫ్ కూటమి సైతం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇటీవలే భారీ బహిరంగ సభ నిర్వహించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో ప్రచారం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించినప్పటికీ.. ఇరువురు నేతలు ఇందుకు దూరంగా ఉన్నారు. కేరళలో ప్రత్యక్షంగా ఎల్డీఎఫ్తో తలపడుతున్న నేపథ్యంలో రాహుల్ ఆ రాష్ట్రంపైనే దృష్టిసారించారు. లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ కాంగ్రెస్ నుంచి కూటమి తరఫున ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ వామపక్ష కూటమి ప్రచారాన్ని నడిపిస్తున్నారు.
కాంగ్రెస్-వామపక్షాల ర్యాలీకి హాజరైన జనం ఇదీ చదవండి:బంగాల్ దంగల్: భాజపాలో గంగూలీ చేరిక ఖాయమా?