తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కుటుంబ పార్టీలతో భారత ప్రజాస్వామ్యానికి ముప్పు' - రాజ్యసభలో ప్రధాని మోదీ

PM Modi in Rajya Sabha: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని.. కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుటుంబ పార్టీల నుంచి భారత ప్రజాస్వామ్యం ముప్పును ఎదుర్కొంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్​ లేకపోతే కనీస అవసరాల కోసం సామాన్య ప్రజలు చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చేది కాదని విమర్శించారు.

PM Modi in Rajya Sabha
PM Modi in Rajya Sabha

By

Published : Feb 8, 2022, 12:36 PM IST

Updated : Feb 8, 2022, 2:53 PM IST

PM Modi in Rajya Sabha: కుటుంబ పార్టీల నుంచి భారత ప్రజాస్వామ్యం పెద్ద ముప్పును ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం అయితే మొట్టమొదట నష్టపోయేది ప్రతిభనేని ప్రధాని అన్నారు. బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై మోదీ నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్​ అభివృద్ధి నిరోధకం!

దేశ అభివృద్ధికి కాంగ్రెస్ ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు మోదీ. తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి కనీస అవసరాలు పొందేందుకు సామాన్య ప్రజలు ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని.. దీనంతటకీ కాంగ్రెస్ కారణమని విపక్షంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అర్బన్​ నక్సల్స్​ కబంధ హస్తాల్లో చిక్కుకుందని.. వారే పార్టీ ఆలోచనలను, భావజాలాన్ని నియంత్రిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ ప్రతికూలంగా మారిందన్నారు. కేంద్రంలోని 50 ఏళ్ల పాలనలో అనేక పార్టీలకు చెందిన 50కి పైగా రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్​ లేకపోతే దేశం అత్యవసర పరిస్థితిని, సిక్కుల ఊచకోత, కశ్మీర్​ లోయ నుంచి పండిట్ల వలసలను చూసేది కాదన్నారు.

"కాంగ్రెస్ లేకపోతే ఏం జరిగేది? మహాత్మా గాంధీ భావించినట్లే.. స్వాతంత్ర్యం లభించిన తర్వాత కాంగ్రెస్​ను రద్దు చేసి ఉంటే దేశంలో కుటుంబ రాజకీయాలు ఉండేవి కాదు. జాతీయ తీర్మానాలపై దేశం పనిచేసేది. ఎమర్జెన్సీ ఉండేది కాదు. కుల రాజకీయాలు, సిక్కుల ఊచకోత, కశ్మీరీ పండిట్ల సమస్య.. ఇవేవీ ఉండేవి కాదు."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'పార్టీ పేరు మార్చుకోవాలి'

కాంగ్రెస్‌ తమ పార్టీ పేరును భారత జాతీయ కాంగ్రెస్‌ నుంచి ఫెడరేషన్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌గా మార్చుకోవాలని హితవు పలికారు మోదీ.

"కుటుంబ పాలనను మించి ఆలోచించకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సమస్య. భారత ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదం కుటుంబ పార్టీల నుంచే ఉందని మనం అంగీకరించాలి. పార్టీలో కుటుంబమే ప్రాధాన్యం అయితే మొట్టమొదట నష్టపోయేది ప్రతిభ. అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీలో ప్రజాస్వామ్య ఆదర్శాలు, విలువలను వృద్ధి చేసుకోగలవని నేను భావిస్తున్నాను. భారతదేశ పురాతన పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ ఆ బాధ్యత ఇంకా ఎక్కువ తీసుకోవాలి."

- ప్రధాని నరేంద్ర మోదీ

ప్రపంచమే ప్రశంసిస్తోంది

మానవజాతి 100 ఏళ్లలో కరోనా వంటి సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా సమయంలో భారత్​ తీసుకున్న చర్యలను ప్రపంచం అభినందిస్తోందన్నారు. కొవిడ్​తో ప్రభావితమైన అన్ని వర్గాల ప్రజల కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. వైరస్​ను ఎదుర్కోవడానికి మరింత చొరవ తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు.

దేశమంతా ఏకతాటిపైకి వచ్చి కరోనాపై పోరాడటాన్ని మోదీ ప్రశంసించారు. దేశంలో వ్యాక్సినేషన్​ వేగంగా కొనసాగుతోందని.. 100 శాతం వ్యాక్సినేషన్​ దిశగా పయనిస్తోందని చెప్పారు. 130 కోట్ల మంది సంకల్ప శక్తి, క్రమశిక్షణ వల్ల ఇది సాధ్యమైందన్నారు.

రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి అజెండా

రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి పథంలో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై అందరూ దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత్​కు స్వాతంత్య్రం వచ్చి అప్పటికి 100 ఏళ్లు పూర్తి కానుందని.. అభివృద్ధే అజెండాగా ముందుకు సాగాలన్నారు. కరోనా సమయంలోనూ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడినట్లు తెలిపారు. అదే సమయంలో ఐదు కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటిని అందించినట్లు వెల్లడించారు.

మరోవైపు.. ఆత్మనిర్భర్​భారత్ ప్యాకేజీ వల్ల చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగం అత్యధికంగా లాభపడిందన్నారు మోదీ. రక్షణ రంగంలోకి ప్రవేశించేందుకు ఎంఎస్‌ఎంఈలు ముందుకు వస్తున్నాయని.. ఇది రక్షణ రంగంలో దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

విభజన తీరుతో ఏపీ, తెలంగాణ నష్టపోతున్నాయి

ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి.. ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మోదీ ఆక్షేపించారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదన్న మోదీ.. విభజించిన తీరు కాంగ్రెస్‌ అహంకారం, అధికార మత్తుకు నిదర్శనంగా ఉందని విమర్శించారు.

మోదీ మాట్లాడిన అనంతరం ఎలాంటి సవరణలు లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది.

కాంగ్రెస్ వాకౌట్

మోదీ ప్రసంగం సాగుతుండగానే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని విస్మరించి.. కాంగ్రెస్​పై విమర్శలు చేయడాన్నే మోదీ పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అంటే.. ఎప్పుడూ ప్రసంగాలు చేయడమే కాదని.. ఒకరు చెప్పింది కూడా వినాలని హితవు పలికారు.

ఇదీ చూడండి:కాంగ్రెస్​పై మోదీ ఫైర్.. ఓడినా అహంకారం తగ్గలేదంటూ..

Last Updated : Feb 8, 2022, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details