జమ్ముకశ్మీర్‌కు టూరిస్టుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. అధికంగా కురుస్తున్న మంచులో కశ్మీర్ అందాలను చూడాలని దేశం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం క్రిస్మస్‌తో పాటు నూతన సంవత్సరం దృష్ట్యా అక్కడి హోటళ్లు ముందస్తు బుకింగ్ అయ్యాయని.. జనవరి మొదటి వారం వరకు ఏ హోటల్ కూడా ఖాళీ లేదని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకపరంగా ఈ ఏడాది జమ్ముకశ్మీర్ మంచి లాభాల్ని గడించింది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రతో పాటు ఇతర టూరిస్టులతో కలిపి నవంబర్ వరకు 22 లక్షల మంది జమ్ముకశ్మీర్‌ను సందర్శించారు.
గతేడాది శీతాకాలంలోనూ పర్యాటకులు అధిక సంఖ్యలో జమ్ముకశ్మీర్‌ను సందర్శించారని ట్రావెల్ ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు ఫరూఖ్ తెలిపారు. గత రెండు వారాలుగా గుల్మార్గ్, పాల్ఘంకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని చెప్పారు. మంచు అధికంగా కురుస్తుండటం సందర్శకులను ఆకర్షిస్తోంది. హోటళ్ల యజమానులు టూరిస్టుల కోసం వివిధ రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచారు. శ్రీనగర్‌లోనూ హోటళ్లలో ముందస్తు బుకింగ్‌లు అధికంగానే ఉన్నాయి.
పర్యాటకుల కోసం డిసెంబర్ 25న వింటర్ కార్నివాల్‌తో పాటు నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఫరూఖ్ తెలిపారు. టూరిస్టుల కోసం ఇప్పటికే హౌస్‌బోట్ ఫెస్టివల్, రాక్ క్లైంబింగ్ ఈవెంట్లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.