దేశంలోని మొత్తం 25 ఉన్నత న్యాయస్థానాలకు గాను 24 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం పూర్తైంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు మరో న్యాయమూర్తి నియామకం జరగాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు ఖాళీలను భర్తీ చేసేందుకు న్యాయశాఖకు కొలీజియం సిఫార్సు చేయాల్సి ఉంది.
గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధులియాకు కొలీజియం పదోన్నతి కల్పించగా.. ఆ ఫైలు ఒక్కటి పెండింగులో ఉంది. ఈ వారంతంలో అధికారిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్‌కు ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదోన్నతి దక్కింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ హిమా కోహ్లీ.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పంకజ్ మిత్తల్ జమ్ముకశ్మీర్-లద్దాఖ్ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకమయ్యారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీబ్ బెనర్జీ మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
మొత్తం ఐదుగురు న్యాయమూర్తులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇప్పటికే నలుగురి నియామకం పూర్తి కాగా.. గువాహటి హైకోర్టు సీజే నియామక ప్రక్రియ కూడా ఈ వారం పూర్తి అవుతుంది.