పశ్చిమ్ బంగాలో అల్ ఖైదా కార్యకలాపాలు విస్తరిస్తున్నాయన్నారు ఆ రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్. ఉగ్రవాదులకు బాంబులు సైతం సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. బంగాల్ ఎన్నికల నిర్వహణపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ధన్కర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు.
పెరిగిన హింస..
త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో.. దిల్లీలో హోంమంత్రి అమిత్ షాను కలిసిన ధన్కర్ ఓటర్లు శాంతియుతంగా.. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరారు. బంగాల్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో హింస చెలరేగిందని గుర్తుచేశారు. డీజీపీ అధికారాలు ఎవరివద్ద ఉన్నాయనేది బహిరంగ రహస్యమేనని.. పరిపాలనా యంత్రాంగం సైతం మొద్దునిద్రలో ఉందని విమర్శించారు. దీంతో రాష్ట్ర భద్రతకు ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు.