UP Election Results 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఆశించిన అభివృద్ధి జరగలేదని, ఉద్యోగ కల్పనలో భాజపా ఘోర వైఫల్యం చెందిందని, సంక్షేమంపైనా పెద్దగా దృష్టిసారించలేదనే విమర్శలు గత కొద్ది నెలలుగా విస్తృతస్థాయిలో వినిపించాయి. కరోనా సంక్షోభమూ అభివృద్ధిపై తీవ్ర ప్రభావమే చూపింది. ఈ అంశాలను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాజ్‌వాదీ పార్టీ సఫలం కాలేదని విశ్లేషకులు చెబుతున్నారు. తన ప్రచార సభలకు వస్తున్న ఆదరణతో అధికారం ఖాయమని మురిసిపోయిన అఖిలేశ్ యాదవ్.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టకపోవడం వల్లే ఓటమిని ఎదుర్కోక తప్పలేదనే వాదన వినిపిస్తోంది.
UP Results
సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో పెద్దఎత్తున రైతుల ఉద్యమం నడిచినప్పటికీ, కర్షకులను తమవైపు తిప్పుకోవడం సమాజ్‌వాదీ పార్టీకి చేతకాలేదు. తమ పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు ఆవేదనలో ఉన్నా.. వారిని ఓదార్చి, భరోసా కల్పించే ప్రయత్నం జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోసారి కుల సమీకరణాలనే నమ్ముకొని బొక్కబోర్లా పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాదవ్‌లు, ముస్లింల ఓట్లను సాధించడంలో కొంతమేర సఫలమైనప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పూర్తిగా తమవైపు తిప్పుకోవడంలో అఖిలేశ్ సఫలం కాలేకపోయారు. మైనార్టీలకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు. యూపీలో బీఎస్పీ తన ప్రాభవాన్ని దాదాపుగా కోల్పోగా..ఆ పార్టీకి అండగా ఉన్న వర్గాలను ఆకట్టుకోలేకపోయారు. యాదవ్‌లు, ఎస్సీలు ఉప్పు-నిప్పులా మారడం ఎస్పీకి పెద్ద మైనస్‌లా మారింది.