కరోనా వ్యాక్సిన్ 'కొవిషీల్డ్'ను భాజపా టీకాగా అభివర్ణించారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. భాజపా వ్యాక్సిన్‌ను తాను వేయించుకోనని తెలిపారు. ఈ టీకాను తాను విశ్వసించబోనని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చప్పట్లతో కరోనా అంతం అవుతుందని చెప్పిందన్న అఖిలేష్.. డ్రైరన్ లాంటి కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించారు. విపక్షాలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదనే కేంద్రం కరోనా పేరుతో కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. 2022లో ఉత్తర్‌ప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపిన అఖిలేష్.. అప్పుడు యూపీ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని వెల్లడించారు.
అఖిలేష్ వ్యాఖ్యలను భాజపా తప్పుబట్టింది. అఖిలేష్ తన వ్యాఖ్యల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే కాకుండా కష్టపడి వ్యాక్సిన్ తయారు చేసిన వైద్యులు, శాస్త్రవేత్తలను కూడా అవమానించారని ఉత్తర్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు.
''అఖిలేష్ యాదవ్‌కు టీకాపై నమ్మకం లేదు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు అఖిలేష్‌పై నమ్మకం లేదు. కరోనా టీకా సమర్థతపై ప్రశ్నలు లేవనెత్తడం డాక్టర్లు, శాస్త్రవేత్తలు అవమానించడమే.''
-కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ ఉపముఖ్యమంత్రి