Akhilesh Yadav News: యూపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచింది సమాజ్వాదీ పార్టీ. ఉన్నావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు మద్దతుగా ఎస్పీ.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలి తల్లి ఆశా సింగ్కు ఎస్పీ అడ్డురాదని స్పష్టం చేశారు. ఆమెకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.
ఎంట్రీలు బంద్..
గత కొద్ది రోజులుగా భాజపా నుంచి ఎస్పీలోకి ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అఖిలేశ్ యాదవ్. ఇకపై భాజపా ఎమ్మెల్యేలను, మంత్రులను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. కావాలంటే తమ నేతలకు భాజపా టికెట్లు నిరాకరించుకోవచ్చు అని పేర్కొన్నారు.
స్వామి ప్రసాద్ మౌర్య, భగవతి సాగర్, వినయ్ శక్యా, రోషన్ లాల్ వర్మ, ముకేశ్ వర్మ, బ్రజేశ్ కుమార్ ప్రజాపతి వంటి కీలక భాజపా నేతలను తమ పార్టీలోకి చేర్చుకున్న కొన్ని గంటలకే అఖిలేశ్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.