పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వ్యతిరేకంగా ఉద్యమించి, జైలుపాలైన అఖిల్ గొగొయీ.. అస్సాం రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. కారాగారంలో ఉండటంతో ప్రచారపర్వంలో పాల్గొనకుండానే ఎన్నికల్లో గెలుపొందిన తొలి అస్సామీగా ఆయనకు ఈ ఘనత దక్కింది. శివసాగర్ నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన సురభి రాజ్‌కోన్‌వారిపై 11,875 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో గొగొయీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 2019 డిసెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆయనను అరెస్టు చేసింది. ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలో సొంతంగా ఏర్పాటు చేసుకున్న రైజోర్ దళ్ పార్టీ తరఫున ఆయన అస్సాం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. జైల్లో ఉండటం వల్ల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. బహిరంగ లేఖల ద్వారా రాష్ట్ర ప్రజలకు తన వాణిని వినిపించారు. ప్రజా సమస్యలనూ ప్రస్తావించారు.
తల్లి సహకారం
అఖిల్ తరఫున ప్రచార బాధ్యతలను ఆయన తల్లి 85 ఏళ్ల ప్రియాదా గొగొయీ భుజానికెత్తుకున్నారు. ఇరుకైన శివసాగర్ రోడ్లపై తిరుగుతూ ఆమె చేపట్టిన ప్రచారం ఓటర్లను కదిలించింది. వార్ధక్య సమస్యలను పట్టించుకోకుండా ఆమె ప్రదర్శించిన పట్టుదలకు చలించిన సామాజిక హక్కుల కార్యకర్తలు మేధా పాట్కర్, సందీప్ పాండేలు ఆమెతో కలిసి వచ్చారు. 'రైజోర్ దళ్' తరఫున వందల మంది యువకులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు.
భాజపా సైతం గట్టిగానే
మరోపక్క భాజపా కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, పార్టీ ఎన్నికల యంత్రాంగం మొత్తాన్నీ రంగంలోకి దించింది. అంతిమంగా శివసాగర్‌లో అఖిల్ గొగొయీ విజయబావుటా ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలుత ఆయనకు మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత మనసు మార్చుకొని సొంత అభ్యర్థిని రంగంలోకి దించింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. 1977లో జైలు నుంచే లోక్‌సభకు పోటీ చేసిన జార్జి ఫెర్నాండెజ్.. 3లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారని, ఆ తర్వాత అలాంటి ఘనత సాధించిన రాజకీయ ఖైదీగా గొగొయీ నిలిచిపోతారని రాజకీయ విశ్లేషకుడు అతిఖుర్ రహమాన్ చెప్పారు.
అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు
గొగొయీ గువాహటిలోని కాటన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1995-96లో ఆయన కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన జీవితం మొత్తం పోరాటాలమయం. సమాచార హక్కు చట్ట ఉద్యమకారుడిగా ఆయనకు పేరుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. కృషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్‌ఎస్) పేరిట జరిగిన రైతు ఉద్యమాలను ఆయన ముందుండి నడిపించారు. స్థానిక ప్రజల భూ హక్కుల కోసం పోరాడారు. పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాల్లో భారీ డ్యామ్‌ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:చేతిలో డబ్బు లేకున్నా ఎన్నికల బరిలోకి గొగొయ్