అసోం రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే, రైజోర్ దళ్ పార్టీ అధినేత.. అఖిల్ గొగొయి జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యారు. 2019, డిసెంబర్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ప్రమేయం ఉందన్న అభియోగాలను కొట్టివేసింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు. అఖిల్‌తో పాటు ఆయన ముగ్గురు సహాయకులకు విముక్తి లభించింది.
2019 డిసెంబర్లో సీఏఏ నిరసనల నేపథ్యంలో వారిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967(యూఏపీఏ) కింద రెండు కేసులు నమోదు చేశారు పోలీసులు. తొలుత మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చంద్మారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అందులో జూన్ 22నే వారికి విముక్తి లభించింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న ఆరోపణలతో చబౌ పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో గురువారం విచారణ చేపట్టిన ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి ప్రంజల్ దాస్.. కేసును కొట్టివేశారు.
కొద్దిరోజులుగా అఖిల్ గువాహటి వైద్య కళాశాల, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు రిలీజ్ ఆదేశాలు గువాహటి జైలు అధికారులకు అందిన క్రమంలో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. ఆయన ముగ్గురు సహాయకులు ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు.
"చివరకు నిజం బయటపడింది. జైలులో పెట్టాలనే ఏ ప్రయత్నమూ ఫలించలేదని స్పష్టమవుతోంది. ఇంటికి వెళ్లిన తర్వాత సీఏఏ వ్యతిరేక అల్లర్లలో అమరుడైన సామ్ స్టాఫోర్డ్ తల్లిదండ్రులను కలుస్తాను. అక్కడి నుంచి క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి, రైజోర్ దళ్ కార్యాలయాను సందర్శిస్తాను. శుక్రవారం ఉదయం నా నియోజకవర్గం శివసాగర్‌లో పర్యటిస్తా. నేను జైలులో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచి గెలిపించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలి. "