Akash Missile 4 Targets :రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ- డీఆర్‌డీఓ రూపొందించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ సరికొత్త అంచనాలను అందుకుంది. ఒకే ఫైరింగ్ యూనిట్ ద్వారా ప్రయోగించిన నాలుగు క్షిపణులు 25 కిలోమీటర్ల పరిధిలో దూసుకొస్తున్న నాలుగు లక్ష్యాలను ఏకకాలంలో ఢీ కొట్టేలా అభివృద్ధి చేసిన నూతన వ్యవస్థ విజయవంతమైనట్లు DRDO వెల్లడించింది. ఈ సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి దేశంగా భారత్ అవతరించిందని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసింది.
'సింగిల్ ఫైరింగ్ యూనిట్‌ని ఉపయోగించి కమాండ్ గైడెన్స్ ద్వారా ఏకకాలంలో 25 కిలో మీటర్ల పరిధిలో దూసుకొస్తున్న 4 లక్ష్యాలు ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించే తొలి దేశంగా భారత్ అవతరించింది. దేశీయంగా రూపొందించిన ఆకాశ్ వెపన్ సిస్టమ్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టి విజయం సాధించాం' అని డీఆర్‌డీఓ పేర్కొంది.
Akash Missile System :డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో అస్త్రశక్తి - 2023 విన్యాసాలను వాయుసేన నిర్వహించింది. ఈ సందర్భంగా నింగి నుంచి దూసుకొచ్చిన నాలుగు లక్ష్యాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఏకకాలంలో ధ్వంసం చేసింది. భూతలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే ఈ క్షిపణిని షార్ట్ రేంజ్ లక్ష్యాలను ఛేదించేందుకు డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆకాశ్ క్షిపణులను భారత్ సుమారు పదేళ్లుగా సాయుధ దళాల్లో వినియోగిస్తోంది.