Ajit Pawar on Sharad Pawar Age :ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లక్ష్యంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పరోక్ష విమర్శలు చేశారు. 80 ఏళ్లు పైబడినా కొంతమంది పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా లేరని అజిత్ వ్యాఖ్యానించారు. 'మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు 58 ఏళ్లకు పదవీ విరమణ చేస్తారు. సాధారణంగా చాలా మంది ఇతర ఉద్యోగులు 75 ఏళ్ల వయసులో వృత్తిపరమైన జీవితం నుంచి వైదొలుగుతారు. కానీ కొంతమంది 80 దాటి 84 ఏళ్లు (శరద్ వార్ వయసును ఉద్దేశిస్తూ) వచ్చినా రిటైర్ అయ్యేందుకు సిద్ధంగా లేరు. పని చేయడానికి మేం ఉన్నాం కదా. ఏదైనా తప్పు ఉంటే మాకు చెప్పొచ్చు. మాకు సత్తా ఉంది. ఇంతకుముందు నేను ఉప ముఖ్యమంత్రిగా పనిచేశా. అనేక పథకాలు విజయవంతం చేశాం' అని అన్నారు అజిత్ పవార్. ఠాణెలో నిర్వహించిన ఎన్సీపీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక, ఎన్సీపీని చీల్చి బీజేపీ-శివసేన సర్కారుతో చేతులు కలపడాన్ని అజిత్ పవార్ సమర్థించుకున్నారు. తన నిర్ణయానికి కారణాలను చెప్పారు. ప్రజలకు సేవ చేయడం, వారి సమస్యలు పరిష్కరించడం కోసమే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసినట్లు పవార్ వెల్లడించారు. అధికారం లేకపోతే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యం కాదన్నారు. మరాఠా రిజర్వేషన్ల కార్యకర్త మనోజ్ జరాంగేకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబయికి భారీ ర్యాలీ నిర్వహిస్తామని జరాంగే ప్రకటించిన నేపథ్యంలో హెచ్చరిక స్వరం వినిపించారు. 'మరాఠా రిజర్వేషన్లపై గత కొద్దికాలంగా చర్చ నడుస్తోంది. తమ డిమాండ్‌ను నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో కొంతమంది ముంబయికి వస్తామని అనుకుంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దు. అలా చేస్తే ఎవరూ వదిలిపెట్టరు' అని అజిత్ హెచ్చరించారు.