Ajit Pawar Deputy CM : మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరేందుకు ఎన్సీపీని చీల్చారన్న వాదనల్ని తోసిపుచ్చారు అజిత్ పవార్ వర్గం నేతలు. పార్టీలోని అందరి మద్దతు తమకు ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎన్సీపీ పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తామని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తేల్చిచెప్పారు. ఎన్సీపీ శాసనసభాపక్షం శిందే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని చెప్పారు. పార్టీలో అందరూ ఎమ్మెల్యేలు శిందే-ఫడణవీస్ ప్రభుత్వంలో భాగం కావాలని నిర్ణయించారని అజిత్ పవార్ తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేనతో కలిసి వెళ్లగలగినప్పుడు.. బీజేపీతో ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు.
పార్టీ అధినేతపై తిరుగుబాటు చేసిన అజిత్ పవార్.. డిప్యూటీ సీఎంగా ఎన్డీఏ ప్రభుత్వంలో చేరారు. ఆయనతో సహా మొత్తం 9 మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ ముంబయిలో మీడియాతో మాట్లాడారు.
"ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంది. ఆయన ఇతర దేశాల్లో కూడా మంచి ప్రజాదరణ పొందారు. మోదీ నాయకత్వానికి అందరూ మద్దతిస్తున్నారు. రాబోయే లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలిసి పోటీ చేస్తాం. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగమయ్యాం. శుక్రవారం నేను ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేశాను. దేశాభివృద్ధి కోసం ఎన్డీఏలో చేరాం "
-- అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం
Ajit Pawar NCP Logo : ఎన్సీపీ ఎమ్మెల్యేందరూ తన వెంటే ఉన్నారని అన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. ఎన్సీపీ నాయకులంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ప్రాధాన్యం ఉంటుందని.. అందుకే ఎన్సీపీ తమదేనని అన్నారు అజిత్ పవార్. కొందరు ఎమ్మెల్యేలు ఇతర దేశాల్లో ఉన్న కారణంగా వారితో సరిగా చర్చించలేదని.. అయితే తన నిర్ణయానికి వారు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారని వివరించారు. భారతీయ జనతాపార్టీతో తాను కలవడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారని, వారి విమర్శలను పట్టించుకోనని అజిత్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి 24 ఏళ్లు వయసని.. యువ నాయకత్వం ముందుకు రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తాను తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంతృప్తితో ఉన్నారని అన్నారు.
'మోదీ చేతిలో దేశం సురక్షితం'
తాము ప్రభుత్వంలో మూడో పార్టీగా చేరామని అన్నారు ఎన్సీపీ నేత, మంత్రి ఛగన్ భుజగల్. ఎన్సీపీని తాము చీల్చామని అనడం సరికాదని చెప్పారు. ఎన్సీపీ పార్టీ మొత్తం ప్రభుత్వంలో చేరిందని అన్నారు. ప్రధాని మోదీని చాలా సార్లు విమర్శించామని. కానీ ఆయన చేతుల్లో దేశం ప్రస్తుతం సురక్షితంగా ఉందన్నది నిజమని తెలిపారు.