హైదరాబాద్లో కూలీ పని ఎక్కువగా ఉంటుందని ఓ మేస్త్రీ చెప్పిన మాటలు నమ్మి.. సొంత గ్రామాన్ని విడిచిపెట్టాడు అసోం నాగావ్ జిల్లాకు చెందిన అజయ్ బోడులే(migrant labour). హైదరాబాద్ చేరుకున్నాక భవన నిర్మాణ పనుల్లో చేరాడు. అయితే, అతడ్ని తీసుకొచ్చిన మేస్త్రీ ఆకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. మూడు రోజులైనా.. అతని ఆచూకీ లేకపోవటం, వేతనం చెల్లించకపోవటం వల్ల అజయ్(assam labour) ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి తాను మోసపోయానని అర్థం చేసుకున్నాడు.
ఎవరిని అడగాలో తెలియదు. సాయం చేసే వారు లేరు. విసుగు చెందిన అజయ్.. తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు. చేతిలో డబ్బులు లేకపోవటం వల్ల తన కాళ్లనే నమ్ముకున్నాడు. మూడు నెలల క్రితం నడక ప్రారంభించాడు. మార్గం మధ్యలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునేవాడు అజయ్. ఏదీ దొరకని సమయంలో మంచి నీళ్లతో సరిపెట్టుకునేవాడు.
" నాపేరు అజయ్ బోడులే. మా గ్రామం పేరు నంబర్. అసోంలోని నాగావ్ జిల్లా. ఇంటి వద్ద మా అన్న, తమ్ముడు ఉంటారు. ఓ మేస్త్రీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు. నెలకి రూ.25వేల వరకు వేతనం వస్తుందని నమ్మించాడు. నేను అక్కడికి వచ్చి 8,9 నెలలు అవుతోంది. హైదరాబాద్లో సెంట్రింగ్ పనులు చేశాను. "