దేశంలోనే తొలిసారిగా గృహ అవసరాల కోసం 'ఎయిర్టెల్ బ్లాక్' పేరిట వివిధ సేవలను ఒకే గొడుగు కింద అందించనున్నట్లు టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఒకే ప్లాన్‌లో ఫైబర్, డీటీహెచ్,మొబైల్‌కు సంబంధించిన సేవలు అందిస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. ఈ మేరకు తమ వినియోగదారులు ఒకే బిల్లుతో ఈ మూడింట్లో ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ సేవలను పొందవచ్చని వెల్లడించింది. ఈ సేవలకు జీవితకాల ఉచిత సర్వీస్‌తో పాటు.. ఇన్స్టాలేషన్ ఛార్జీలు సైతం ఉండవని తెలిపింది. ఒకే బిల్లు సేవల ద్వారా.. నెల తిరిగేసరికి వివిధ చెల్లింపుల ఇబ్బంది తప్పుతుందని ఎయిర్టెల్ అభిప్రాయపడింది.
ప్రత్యేక సేవలు..
'ఎయిర్టెల్ బ్లాక్' యూజర్లకు నిరంతరాయ సేవలందించేందుకు రిలేషన్షిప్ మేనేజర్లను నియమించనుంది సంస్థ. వీరు అంకితభావంతో పనిచేస్తూ.. వినియోగదారులకు తలెత్తే సమస్యలను కస్టమర్లు కాల్ చేసిన 60 సెకన్లలోపే వేగంగా పరిష్కరిస్తారని పేర్కొంది. ఈ సేవలన్నీ ఉచితమేనంది.
'ఎయిర్టెల్ బ్లాక్' ప్లాన్స్ వివరాలు..
ప్లాన్స్ | సేవలు |
రూ.998 | 2 మొబైల్ కనెక్షన్లు+1 డీటీహెచ్ |
రూ.1398 | 3 మొబైల్ కనెక్షన్లు + 1 డీటీహెచ్ |
రూ.1598 | 2 మొబైల్ కనెక్షన్లు + 1 ఫైబర్ కనెక్షన్ |
రూ.2099 | 3 మొబైల్ కనెక్షన్లు + 1 డీటీహెచ్ + 1 ఫైబర్ కనెక్షన్ |