పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పెగసస్, సాగు చట్టాలు, ధరల పెరుగుదల అంశాలపై చర్చకు పట్టుబడుతూ.. బుధవారం సైతం విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. బిగ్గరగా నినాదాలు చేస్తు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. అయితే, ఈ ఆందోళనల మధ్యే రాజ్యసభ మూడు, లోక్‌సభ రెండు బిల్లులకు ఆమోదం తెలిపాయి. అనంతరం గురువారానికి వాయిదా పడ్డాయి.
ఉదయం 11 గంటలకు సమావేశమైన ఉభయసభల్లో.. ఆద్యంతం వాయిదాల పర్వమే కొనసాగింది. పెగసస్, వ్యవసాయ చట్టాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడం వల్ల గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 2గంటల వరకు రాజ్యసభ వాయిదా పడగా... ఆ లోపు లోక్‌సభ మూడు సార్లు వాయిదా పడింది.
బిల్లుల ఆమోదం..
అనంతరం రెండు గంటలకు సమావేశమైన తర్వాత ఉభయ సభలు.. వాయు వేగంతో బిల్లులను ఆమోదించాయి. ఓవైపు విపక్షాల ఆందోళనలు, ప్లకార్డుల ప్రదర్శనలు కొనసాగుతున్నప్పటికీ.. బిల్లులపై అధికార పక్షం ముందుకెళ్లింది. ఫలితంగా రాజ్యసభలో మూడు, లోక్‌సభలో రెండు బిల్లు ఆమోదం పొందాయి. ఇవన్నీ మూజువాణి ఓటుతోనే గట్టెక్కాయి.
ఎంపీలు సస్పెండ్
మరోవైపు, సభా వ్యవహారాలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో ఆరుగురు టీఎంసీకి ఎంపీలను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. తొలుత వారికి హెచ్చరికలు జారీ చేసిన వెంకయ్య.. పరిస్థితి సద్దుమణగకపోవడం వల్ల.. రూల్ 255 ప్రకారం నిరసన చేస్తున్న ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. వేటు పడిన టీఎంసీ ఎంపీలు పార్లమెంట్‌లోనే ఆందోళనకు దిగారు. రాజ్యసభ ప్రవేశద్వారం వద్ద నినాదాలు చేశారు. వీరిని అదుపు చేసేందుకు మార్షల్స్‌ను రంగంలోకి దించారు.
వెంకయ్య అసంతృప్తి
రాజ్యసభలో సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలను పూర్తిగా జరగనివ్వొద్దని కొన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. సాగు చట్టాలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించేందుకు సభ్యులు సహకరించాలని కోరారు. ప్రభుత్వం, విపక్షాలు అవగాహనతో పనిచేయాలని, సభలో సాధారణ పరిస్థితులు ఉండేలా చూడాలని అభ్యర్థించారు. ఈ మేరకు సభలో గందరగోళం సృష్టిస్తున్న పార్టీల నేతలతో వెంకయ్య సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సభలో శాంతియుతంగా ఉన్న పార్టీల ఎంపీలతోనూ భేటీ అయినట్లు వెల్లడించాయి.
ప్రభుత్వానిదే బాధ్యత: విపక్షాలు
అయితే, దేశ భద్రత విషయంలో కీలకమైన పెగసస్ సహా ఇతర సమస్యలపై చర్చించాల్సిందేనని విపక్ష పార్టీలు తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఆ తర్వాత రైతుల సమస్యలపై చర్చించాలని కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలిపాయి. పార్లమెంట్ ప్రతిష్టంభనకు విపక్షాలే కారణమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డాయి. సభల అంతరాయానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నాయి.
రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు- వాటి వివరాలు