తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2021, 7:21 AM IST

ETV Bharat / bharat

'మాస్కును కాదంటే విమానం దిగాల్సిందే'

కొవిడ్‌-19 నిబంధనలు పాటించని విమాన ప్రయాణికులపై శిక్షార్హమైన చర్యలు తీసుకోవాలని దేశీయ విమాన సర్వీసులకు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు దిల్లీ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలు పాటించేందుకు విముఖత చూపించే ప్రయాణికులను టేకాఫ్‌కు ముందు తక్షణం విమానం నుంచి దించివేయాలని ఆదేశించింది.

Delhi HC
'మాస్కును కాదంటే విమానం దిగాల్సిందే'

దేశంలో అంతర్గతంగా తిరిగే విమానాల్లో ప్రయాణికులు మాస్కులు సక్రమంగా ధరించకపోవడం వంటి ప్రమాదకర సంకేతాలు అందుతున్నాయని.. కొవిడ్‌-19 నిబంధనలు పాటించనివారిపై శిక్షార్హమైన చర్యలు తీసుకునేలా తరచూ క్రూ సిబ్బంది తనిఖీల ద్వారా కఠినవైఖరి అవలంబించాలంటూ దిల్లీ హైకోర్టు అన్ని దేశీయ విమాన సర్వీసులకు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయం ప్రయాణికులకు స్పష్టంగా తెలిసేలా విమానంలో సిబ్బంది చేసే ప్రకటనల్లో చేర్చాలని కూడా సూచించింది. మార్చి 5న ఎయిర్‌ ఇండియా విమానంలో కోల్‌కతా నుంచి దిల్లీకి ప్రయాణించిన జస్టిస్‌ సి.హరిశంకర్‌ ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, ప్రయాణికుల నిర్లక్ష్యాన్ని సుమోటో నోటీసుగా స్వీకరిస్తూ.. తక్షణం అమల్లోకి వచ్చేలా పై మార్గదర్శకాలు జారీ చేశారు.

"చూసేందుకు ప్రయాణికులంతా మాస్కులు ధరించినట్టు కనిపిస్తున్నా.. చాలామంది వాటిని గడ్డం కిందికి లాగి, సక్రమంగా ధరించాలన్న సిబ్బంది సూచనలను పెడచెవిన పెడుతున్నట్టు మా పరిశీలనలో తేలింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న ప్రస్తుత దశలో ఈ విధమైన వైఖరి దారుణం. ఒకరికొకరు దగ్గరగా కూర్చొని ఏసీ వాతావరణంలో ప్రయాణించే వ్యక్తుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌ ఉన్నా.. అందరూ బాధితులుగా మారే ముప్పు ఉంది."

-దిల్లీ హైకోర్టు

నిబంధనలు పాటించేందుకు విముఖత చూపించే ప్రయాణికులను టేకాఫ్‌కు ముందు తక్షణం విమానం నుంచి దించివేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఇటువంటి ప్రయాణికులను అవసరమైతే శాశ్వతంగా లేదా కొద్దికాలంపాటు విమాన సర్వీసులకు దూరంగా ఉంచాలని కూడా కోర్టు సూచించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై మార్చి 17న ధర్మాసనం చేపట్టే విచారణ నాటికి ఈ విషయంలో తమ నివేదికలను సమర్పించాలంటూ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌కు, ఎయిర్‌ ఇండియా సర్వీసులకు కోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఇదీ చూడండి:'టీకా తీసుకున్న 48 గంటల తర్వాతే విమానాల్లోకి!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details