Aircraft Crash In Karnataka : కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఎయిర్‌ఫోర్స్ జెట్ విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. భోగ్‌పూర్ సమీపంలోని పొలాల మధ్య గురువారం ఈ జెట్ విమానం కూలిపోయింది. ప్రయాణ సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు పారాచూట్ సాయంతో విమానం నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని వారు వెల్లడించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అనంతరం పైలట్లను.. హెలికాప్టర్లో బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు.
పొలాల మధ్య కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ జెట్ విమానం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన.. ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్(U692) ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. విమానం అదుపు తప్పిందని గుర్తించిన పైలట్లు.. భూమిక, తేజ్ పాల్ చాకచక్యంగా వ్యవహరించి తమ ప్రాణాలు కాపాడుకున్నారని వెల్లడించారు. వారి మెడకు స్వల్ప గాయలైనట్లు పేర్కొన్నారు. ఘటనపై పూర్తి దర్యాప్తు జరుపుతామని అధికారులు పేర్కొన్నారు.
పొలాల మధ్య కుప్పకూలిన వాయుసేన విమానం ఆర్మీ ఛాపర్ క్రాష్.. ఇద్దరు పైలట్లు మృతి..
నెల రోజుల క్రితం భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాల్ ప్రదేశ్‌లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కుప్పకూలిన ఛాపర్‌లోని పైలట్లు లెఫ్ట్‌నెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి, మేజర్ ఎ. జయంత్‌గా మృతి చెందారు. అయితే లెఫ్టెనెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లాకు చెందినవారు. ఆయన భార్య కూడా ఆర్మీలోనే దంత వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చిన్న పొరపాటు.. ఎయిర్‌పోర్ట్‌లోనే విమానం బోల్తా.. లక్కీగా..
అంతకు ముందు కేరళలోనూ ఓ విమాన ప్రమాదం జరిగింది. ఘటనలో ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. రాజధాని తిరువనంతపురంలో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. ఘటనలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేపై నుంచి అదుపుతప్పి పక్కకు వెళ్లిన విమానం.. అనంతరం బోల్తాపడింది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఉన్న రాజీవ్ గాంధీ అకాడమీ ఫర్ ఏవియేషన్ టెక్నాలజీకి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది.పైలట్‌గా శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఈ విమానాన్ని నడిపారు. అతడికి ఎటువంటి హాని కలగలేదు. ఘటన జరిగినప్పుడు విమానంలో అతడు ఒక్కడే ఉన్నారు. విమానం రన్‌వేపై నుంచి అదుపుతప్పి పక్కకు వెళ్లడాన్ని గమనించిన ట్రైనీ పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలను కాపాడుకున్నారు.ప్రమాద దృశ్యాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
జనవరిలోనూ మధ్యప్రదేశ్‌లో రెండు యుద్ధవిమానాలు కుప్పకూలాయి. రాజస్థాన్ సరిహద్దు జిల్లా అయిన మొరెనాలో సుఖోయ్ సుఖోయ్-30, మిరాజ్-2000 కుప్పకూలాయి. ఈ ప్రమాదంలో మిరాజ్ విమాన పైలట్ మరణించారు.